రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయంతో సర్కార్ కు భారీ ఆదాయం

by Muthe.Rajitha |

హైదరాబాద్ పరిసరాల్లోని ఘట్ కేసర్ పోచారం, నాగోలు బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం ముగిసింది.

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయంతో సర్కార్ కు భారీ ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పరిసరాల్లోని ఘట్ కేసర్ పోచారం, నాగోలు బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ రెండు చోట్ల ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి గత నెల 4వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతోనే , నో లాస్ నో ప్రాఫిట్ విధానం కింద మొత్తం 401 ఫ్లాట్లను విక్రయించారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ముందు ప్రకటించిన విధంగా లాటరీ విధానం ద్వారా ప్రాథమిక కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఫ్లాట్ల విక్రయం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు సుమారు రూ. 78 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

ఒక్కో ఫ్లాట్ కు ఒకే దరఖాస్తు..

పోచారంలో వరుసగా రెండో రోజు(శనివారం) కూడా పారదర్శకంగా ఈ అలాట్ మెంట్ ప్రక్రియను నిర్వహించారు. ఇక్కడ అత్యధిక శాతం ఫ్లాట్లకు ఒక్క దరఖాస్తు వచ్చినవే ఉన్నాయి. రెండో రోజు 3 బీహెచ్ కే, సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ల ప్రక్రియను ఘట్ కేసర్ తహశీల్దార్ రజని, స్వగృహ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి తదితర అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఒక ఫ్లాట్ కు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన సందర్భాల్లో లాటరీ తీసి కేటాయింపు జరిపారు. ఇక్కడి త్రీబెడ్ రూం ఫ్లాట్లలో ఒకదానికి 69 దరఖాస్తులు రావడం విశేషం. అంతేకాకుండా బండ్లగూడ లో దరఖాస్తు చేసుకుని లాటరీ లో ఫ్లాట్లు రానివారికి కూడా పోచారంలో దరఖాస్తు చేసుకోడానికి అవకాశమిచ్చారు. ఇటువంటి వారి కోసం శనివారం మరోసారి లాటరీ ప్రక్రియను నిర్వహించి, కేటాయింపు దారులను ఎంపిక చేశారు.

మరో వారం రోజుల పాటు కేటాయింపు…

బండ్లగూడ, పోచారం ప్రాంతంలోని మిగిలిన సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు కూడా దరఖాస్తు చేసుకోడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు, ఆగస్టు 8వ తేదీ వరకు అవకాశమిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండి వీపీ.గౌతం తెలిపారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన (ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్) ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశం కేవలం సింగిల్, డబుల్ బెడ్ రూం ఫ్లాట్లకు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

4వ తేదీ నుంచి ఓపెన్ ఫ్లాట్ల వేలం

పోచారం, బండ్లగుడలోని ఫ్లాట్ల వేలంతోపాటు నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో స్వగృహ కార్పొరేషన్ కు చెందిన ఓపెన్ ఫ్లాట్లను బహిరంగ వేలం పాట ద్వారా విక్రయించాలని నిర్ణయిచారు. 200 చ.గ. అంతకు మించిన విస్తీర్ణంలోని ఈ ప్లాట్ల విక్రయాలు ఆగస్టు 4(సోమవారం) నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడలో 20 ఫ్లాట్లు (4 వతేదీ), తరువాత మేడ్చల్-మల్కాజిగిరి బహదూర్ పల్లి లోని 69 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా తొర్రూర్ లో (6 వ తేదీ) 100 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Next Story