- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుమ్మిడిహెట్టిపై సర్కార్ ఫోకస్.. ప్రాణహిత-చేవెళ్ల నిర్మించేందుకు కసరత్తు
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టిన ప్రాణహితకు మళ్లీ ప్రాణం పోయాలని రంగం సిద్ధం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రాణహితను నిర్మిస్తామని చెబుతూ వస్తున్నది. మరోవైపు.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారడంతో ప్రాణహితను నిర్మించి రైతులకు సాగు నీరు అందించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో ప్రాణహిత నది వెంట రిటైర్డ్ ఇంజినీర్ విఠల్‌రావు ఆధ్వర్యంలోని ఎస్వీ కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డకు రిపేరు, మెయింటెనెన్స్ ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయం దిశగా ఆలోచన చేస్తున్నది.
2008లో ప్రాణహితకు శంకుస్థాపన
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 2008 డిసెంబర్ 16న అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో ముందుకెళ్లలేదు. దాంతో తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహితను పక్కనపెట్టేసింది. తుమ్మిడిహెట్టి నుంచి లొకేషన్‌ను మేడిగడ్డకు మార్చింది. అంతేకాకుండా ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేసి.. అధిక వడ్డీలతో అప్పులు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ కుంగిపోయింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రాణహితను తెరమీదకు తీసుకొచ్చింది. కాంగ్రెస్ గెలిచాక ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించింది. మహారాష్ట్ర వైపు ఉన్న గ్రామాలు, అడవి, అక్కడి భూముల వివరాలు, నది స్వభావం, స్థితి, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, లోతు వివరాలను సర్వే సంస్థ నమోదు చేసింది.
మహారాష్ట్రతో త్వరలోనే చర్చలు
మహారాష్ట్రతో ఎలాంటి వివాదాలు రాకుండా తుమ్మిడిహెట్టికి దిగువన రిజర్వాయర్నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది. ప్రాణహిత నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 165 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు, ఎల్లంపల్లి నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. గతంలో నిర్మించిన 70 కిలోమీటర్ల పొడవైన కాల్వలను ఉపయోగంలోకి తీసుకొస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నది. ప్రాజెక్టు ఎత్తు విషయమై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఈ మేరకు బాధ్యతలను ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌కు అప్పగించారు. గతంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని 152 మీటర్లుగా ప్రతిపాదించారు. అంత ఎత్తులో బ్యారేజీ నిర్మాణంతో తమ భూభాగంలో ముంపు ఏర్పడుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ కారణంతోనే ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించిందని మాజీ మంత్రులు చెబుతున్నారు. అందుకే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించాలని భావిస్తున్నది. 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్లకు ప్రతిపాదనలు ఇచ్చింది. అయితే.. దానికి అంగీకరించకపోవడంతో 150 మీటర్ల మధ్యకు తగ్గించి నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ సైతం అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని వెల్లడించారు. అందులో భాగంగానే.. మరికొద్ది రోజుల్లోనే చర్చలు జరిపేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది.
కాళేశ్వరంతో మోయలేని భారం
ఇప్పటికే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేసి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. అయితే.. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రెండు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ఇప్పుడు దానికి రిపేరు చేయించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే వేల కోట్ల కరెంటు బిల్లులు వస్తున్నాయి. దాంతో అది కూడా ప్రభుత్వంపై అదనపు భారం తప్పితే పెద్దగా సాగునీరు అందే అవకాశం తక్కువేనని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే.. అటకెక్కిన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా కీలక అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మళ్లీ కసరత్తు మొదలుపెట్టింది. తక్కువ ఖర్చుతోపాటే గ్రావిటీ ఆధారంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మించాలని రూపకల్పన చేస్తున్నది. ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతో.. కాళేశ్వరం విద్యుత్ భారం సైతం తగ్గుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రాణహితతోనే ప్రయోజనం
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం పలు సానుకూల అంశాలను ప్రతిపాదిస్తున్నది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) తీర్పు ప్రకారం ఇక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ నీటిని గ్రావిటీ ద్వారానే ఆయా ప్రాంతాలకు, జిల్లాలకు తరలించొచ్చు. మరోవైపు.. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు, కాళేశ్వరంతో పోలిస్తే నామమాత్రమే. అంచనాల ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీకి అయ్యే వార్షిక కరెంటు ఖర్చు సుమారు రూ.150 కోట్లు మాత్రమే. అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు ఏడాదికి రూ.12వేల కోట్ల వరకు విద్యుత్ బిల్లులకే చెల్లించాల్సి వస్తున్నది. గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని అందించడం వల్ల ఈ ఖర్చంతా ఆదా కానుంది. మరోవైపు.. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 72 కిలోమీటర్ల పొడవైన ప్రధాన గ్రావిటీ కెనాల్‌ను నిర్మించింది. ఇప్పుడు ఆ కాలువను వినియోగించుకుంటే నిర్మాణ వ్యయం, సమయం రెండూ ఆదా అవుతాయని పలువురు నిపుణులు వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే తక్షణమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు స్థిరమైన సాగునీరు అందుతుంది. అంతేకాకుండా.. ప్రాణహిత నీరు ఎల్లంపల్లికి చేర్చడం వల్ల ఉత్తర తెలంగాణతోపాటు సూర్యాపేట జిల్లాకు సైతం నీరిచ్చే వెసులుబాటు కలుగుతుంది.






