పింఛన్ నుంచి దళితబంధు వరకు.. సంక్షేమ పథకాల్లో సర్కారీ బ్రోకర్లు?

by Disha Web Desk 2 |
పింఛన్ నుంచి దళితబంధు వరకు.. సంక్షేమ పథకాల్లో సర్కారీ బ్రోకర్లు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: "జీహెచ్ఎంసీ పరిధి కూకట్‌పల్లి జోన్‌లోని ఓ డివిజన్. నాలుగేండ్ల కిందట్నుంచి వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకున్న ఓ విడోకు పింఛన్ వచ్చింది. అంతే.. జాబితా పట్టుకున్న సదరు డివిజన్ కార్పొరేటర్ అనుచరుడు వెంటనే ఆ కాలనీలో వాలిపోయాడు. పింఛన్ ఇప్పించాం.. కార్డు వచ్చింది.. కార్డుకు రూ.1‌‌0‌00 చొప్పున ఇవ్వాలని వసూలు చేశాడు. ఇలా దాదాపు ఒకే కాలనీ 20 మంది దాకా వసూలు చేసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత యాధృచ్చికంగానే వారందరికీ కార్డు వచ్చింది.

"రామగుండం మున్సిపాలిటీలోని ఇలాంటి వ్యవహారమే. ఓ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆసరా పింఛన్లు వచ్చాయంటూ ఫోన్ చేసి, తన వాళ్లను పంపిస్తున్నానంటూ వసూలు చేసింది. అంతేకాదు.. అప్లై చేసుకున్న వారి వివరాలు తెలుసుకుని ఇంకా రెండో జాబితా వస్తుంది.. మీ ఆధార్​ కార్డు, ఫొటోతో పాటుగా రూ.10 వేలు ఇవ్వండి.. వచ్చే జాబితాలో పేరు ఉంటుంది.." అంటూ సదరు మహిళా కార్పొరేటర్ హామీ ఇస్తూ వసూళ్లకు దిగారు. ఈ విషయం తెలిసిన అక్కడి కమిషనర్​.. బహిరంగంగా ఓ ప్రకటన ఇచ్చారు. ఆసరా కార్డులు పంపిణీ చేస్తాం.. మధ్యవర్థులు, దళారులను నమ్మవద్దు అంటూ లబ్ధిదారులకు సూచించారు.

"నిజామాబాద్​ జిల్లాలోనూ అంతే. కొంతమంది గ్రామాల ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి నేతలు.. లబ్ధిదారుల నుంచి కార్డుకు వెయ్యి చొప్పున వసూలు చేశారు. వెయ్యి ఇస్తేనే కార్డు ఇస్తామంటూ చెప్పుతూ వచ్చారు. ఈ విషయం కూడా బయటకు రావడంతో.. మండలాల వారీగా అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కార్డుతో అవసరం లేదని, కార్డు ఉన్నా లేకున్నా.. మంజూరు జాబితాలో పేరున్న వారందరికీ పెన్షన్​ వస్తుందని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.

సంక్షేమ పథకాల్లో బ్రోకర్లు ఎక్కువయ్యారు. ఎమ్మెల్యేల నుంచి మొదలుకుని.. కిందిస్థాయి లీడర్లు, సర్పంచ్‌ల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీనికి కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, నేతలు చెప్పే సమాధానం కూడా వింతగా మారింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నిధులు, చేసిన పనులకు బిల్లులు కూడా రావడం లేదని, ఇలాంటి సమయంలో సంక్షేమ పథకాలు ఇప్పించి ఎంతో కొంత తీసుకుంటే తప్పేంటని ఎదురుప్రశ్న వేస్తున్నారు.

పరిశీలనలో తేలిన వసూళ్ల దందా

ఎమ్మెల్యే స్థాయిలో దళితబంధు వరంగా మారింది. పది లక్షల్లో రెండు లక్షలు తమ వాటా కింద తీసుకుంటున్న వైనం ప్రభుత్వ పరిశీలనలోనే తేలింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు నేరుగా వసూలు చేసుకుంటుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అనుచరవర్గం ఈ బాధ్యతలను మీదేసుకుంది. లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేల పేరుతో రెండు లక్షలు తీసుకుంటున్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇటీవల ప్రతి సెగ్మెంట్ నుంచి వివరాలు సేకరించే పనిని నిఘా బృందానికి అప్పగించారు. దీంతో దళితబంధులో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ నుంచే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రతి సెగ్మెంట్‌లో దళిత బంధు లబ్ధిదారులకు కాల్ చేసి, స్కీం పేరుతో వసూళ్లు చేశారా అంటూ నేరుగా ప్రశ్నలడిగారు. 90 శాతం మంది లబ్ధిదారుల నుంచి రూ.2 లక్షల చొప్పున తీసుకున్నట్లు తేలింది.

మళ్లీ ముందస్తు వసూళ్లు

కొన్నిచోట్ల ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. రెండో విడుతలో వస్తాయని చెప్తున్న ఎమ్మెల్యేలు.. తమ అనుచరులకు తలా పది చొప్పున మంజూరు చేస్తామని చెప్పి, ఒక్కోక్క లబ్ధిదారుడి నుంచి రూ. 2లక్షల చొప్పున ఇవ్వాలని షరతు పెడుతున్నారు. కొన్నిచోట్ల ముందుగానే ఇవ్వాలని కండీషన్​ పెడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రగతి భవన్ నుంచి హెచ్చరికలు వెళ్లినా.. ఈ వసూళ్ల దందా ఆగడం లేదనే ఫిర్యాదులున్నాయి.

ఆసరా కార్డులోనూ అదే తీరు

లక్షల్లో ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తుంటే.. వేలల్లో కిందిస్థాయి కేడర్ కూడా ఆదే దారిలో నడుస్తోంది. తాజాగా రాష్ట్రంలో సాగుతున్న ఆసరా మంజూరు కార్డుల పంపిణీలోనూ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, లీడర్లు ఆసరా కార్డుకు వెయ్యి చొప్పున తీసుకుంటున్నారు. అధికారుల నుంచి ముందుగానే మంజూరు జాబితా తీసుకుని, లబ్ధిదారులకు కాల్ చేస్తున్నారు. తామేం పింఛన్​ ఇప్పిస్తున్నామని, ముందుగా వెయ్యి ఇస్తేనే మంజూరు కార్డు ఇస్తామంటూ వసూలు చేస్తున్నారు. అసలే పింఛన్ల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు ఎలాగైతేనేం వెయ్యి చేతిలో పెడుతున్నారు.

రెండో జాబితా వస్తుంది.. మీకిప్పిస్తాం

కొన్ని గ్రామాల్లో అప్లై చేసుకున్న వారి నుంచి లీడర్ల కొత్త తరహాలో దండుకుంటున్నారు. 57 ఏండ్ల పెన్షన్లలో చాలా మేరకు పెండింగ్ ఉన్నాయి. ఇదే వారికి అవకాశంగా మారుతోంది. కొంతమంది అనర్హులు కూడా ఉండటంతో పూర్తి సర్వే తర్వాత ఇచ్చేందుకు అధికారులు తుది పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేతలు రంగంలోకి దిగుతున్నారు. తాము పెన్షన్ ఇప్పిస్తామని, రెండో జాబితా సిద్ధమవుతుందని, రూ. 10వేలు ఇస్తే పెన్షన్​ వస్తుందంటూ చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా వసూళ్లు కూడా చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

కాగా, ఆసరాలో వసూళ్ల పర్వంపై అధికారులు కూడా స్పందిస్తున్నారు. కొన్నిచోట్ల మండలాల వారీగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఆసరా జాబితాలో పేరున్న వారందరికీ మంజూరు కార్డులు వచ్చినా రాకున్నా.. పెన్షన్ వస్తుందని, అంతేకానీ, మంజూరు కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుందనే ప్రచారాన్ని నమ్మొద్దంటూ చెప్తున్నారు. కొన్నిచోట్ల 57 ఏండ్ల పెన్షన్‌పై పరిశీలన జరుగుతుందని, అర్హులకు కచ్చితంగా మంజూరు చేస్తామని, ఎవరికీ డబ్బులు ఇవ్వరాదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు.


Next Story

Most Viewed