- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరిగేషన్ శాఖలో పాలన అస్తవ్యస్తం.. అసలు ఈఎన్సీలు ఎవరు?
రాష్ట్ర వ్యవసాయానికి గుండెకాయ అయినటువంటి నీటిపారుదల శాఖ విభాగం అస్తవ్యస్తంగా తయారైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యవసాయానికి గుండెకాయ అయినటువంటి నీటిపారుదల శాఖ విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఆ శాఖ కార్యాలయం జలసౌధలో పరిపాలన విభాగం గందరగోళంగా ఉంది. ఏ అధికారి ఎప్పుడు బదిలీ అవుతున్నారో.. ఏ కుర్చీలోకి ఎవరు వస్తున్నారో? తెలియకుండా ఉంది. కీలక పోస్టులైన ఈఎన్సీల (ఇంజినీర్ ఇన్ చీఫ్) సీట్లలో ఎవరు ఉంటున్నారో తెలియడం లేదు. పలువురు సీఈలకు అదనపు బాధ్యతలు అప్పగించి శాఖను నడిపిస్తున్నారు. అయితే.. వచ్చినవారు సైతం ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఈ మధ్య ఈఎన్సీ అడ్మిన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి నాలుగు రోజులకే ఉద్యోగ విరమణ పొందారు. ఇక.. ఈఎన్సీ(జనరల్)గా ప్రస్తుతం ఇన్‌చార్జినే ఉన్నారు. అలాగే.. ఈఎన్సీ(ఓఅండ్ఎం), ఈఎన్సీ (అడ్మిన్) అందరూ ఇన్‌చార్జిలుగానే విధులు నిర్వర్తిస్తున్నారు.
అదనపు బాధ్యతలు.. భారం
కీలక శాఖకు కీలక పదవిలో ఈఎన్సీ (జనరల్)గా ప్రస్తుతం అమ్జద్ హుస్సేన్ అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఈయనకు సీఈ ఎంక్వయిరీస్ బాధ్యతలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా ఇరిగేషన్‌లో కీలక పోస్టు కావడంతో నిత్యం ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశాలకు, రివ్యూలకు అటెండ్ కావాల్సి ఉంది. అటు మంత్రి లెవల్‌లో సైతం ఏర్పాటు చేసే సమావేశాలకు నిత్యం వెళ్లాల్సి ఉంది. అలాగే.. విచారణల కోసం ఎంక్వయిరీస్ చేస్తున్నారు. దీంతో అటు ఇటు రెండు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తున్నది. అయితే.. అంతకుముందు అమ్జద్ హుస్సేన్‌కు ఈఎన్సీ (అడ్మిన్) బాధ్యతలు సైతం ఉండేవి. కానీ.. వాటి నుంచి ఈ మధ్యే ఆయనకు రిలీఫ్ లభించింది. ప్రస్తుతం రెండు కీలక బాధ్యతల్లో కొనసాగుతుండడంతో దేనికీ సరిగా న్యాయం చేయలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏ సమయంలో ఏ చాంబర్‌లో ఉంటారో కూడా ఆగమాగంగా ఉంది. అంతకుముందు నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా మురళీధర్‌ను తప్పించిన తర్వాత ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్‌కుమార్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. అనిల్‌కుమార్‌కు ఈఎన్సీ జనరల్‌గా పూర్తిస్థాయిలో బాధ్యతలు ఇచ్చిన రెండు నెలలకే ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించారు. అనిల్‌కుమార్‌ను ఇటీవల బదిలీ చేసి అమ్జద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌లోనూ అదే దుస్థితి
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీగా ప్రస్తుతం శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గతంలో నీటి పారుదల శాఖలో ఓఅండ్ఎం అనే విభాగం లేదు. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పోస్టును క్రియేట్ చేశారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు విజయభాస్కర్‌రెడ్డి ఓఅండ్ఎం ఈఎన్సీగా కొనసాగారు. ఆ తరువాత చాలాకాలం పాటు ఆ పోస్టు ఖాళీగానే ఉండగా.. ఈ మధ్య ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే.. ఆయన ఆదిలాబాద్ బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటు సమయం కేటాయించడమా.. ఇటు టైం ఇవ్వడమా? తెలియని దుస్థితి నెలకొంది. ఇరిగేషన్‌లో ఈ విభాగానికి సైతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాములు తదితర వాటి మెయింటెనెన్స్ మొత్తం ఈ విభాగమే చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం వచ్చిందంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అయితే.. ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆయన చాలా సందర్భాల్లో ఆదిలాబాద్ సీఈ బాధ్యతల్లో ఉండిపోవాల్సి వస్తున్నది.
ఈఎన్సీ అడ్మిన్ ఆగమాగం..
ఇక పరిపాలన విభాగం ఈఎన్సీగా ఎవరు బాధ్యతల్లో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది. మొన్నటివరకు జి.అనిల్‌కుమార్ ఈఎన్సీ అడ్మిన్‌గా కొనసాగారు. ఆ తరువాత ఆయనకు ఈఎన్సీ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. తదుపరి ఆయనకు ఈఎన్సీ జనరల్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి అడ్మిన్ నుంచి రిలీవ్ చేశారు. ఆ స్థానంలోకి అమ్జద్‌ను నియమించారు. ఆయన ఈ మధ్య ఈఎన్సీ జనరల్‌గా బదిలీ కావడంతో ఆ స్థానంలోకి కరీంనగర్ ఈఎన్సీగా ఉన్న శంకర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే.. ఆయన బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే ఉద్యోగ విరమణ పొందారు. దాంతో మళ్లీ ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఇక ఈ మధ్యే రమేశ్‌బాబుకు బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఇప్పటికే ఆయనకు సూర్యాపేట, ఖమ్మం సీఈ బాధ్యతలు సైతం ఉన్నాయి. ఈఎన్సీ అడ్మిన్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. దాంతో ఆయనకు మూడు బాధ్యతలు తలకుమించిన భారంగా మారాయని టాక్ నడుస్తున్నది.
ప్రమోషన్లు లేక.. పర్మినెంట్ కాక
నీటి పారుదల శాఖలో ప్రమోషన్లు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తున్నది. ఖాళీ అయిన చోట్ల ఎక్కడికక్కడ ఇన్‌చార్జిలుగా నియమించాల్సి వస్తున్నది. అయితే.. కీలక పోస్టుల్లోనూ ఇన్‌చార్జిలే ఉండడంతో పాలన గాడి తప్పుతున్నదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా.. ఈ 6 నెలల కాలంలోనే కీలకమని చెప్పుకుంటున్న ఈ పోస్టుల్లోనూ అధికారులు ఇష్టారీతిన చేంజ్ అయ్యారు. అసలు ఏ సీట్లో ఏ అధికారి వచ్చి కూర్చుంటున్నారో తెలియని పరిస్థితి ఉంది. దాంతో ఎవరికి కూడా వారికి కేటాయించిన పోస్టుపై పూర్తిస్థాయిలో అవగాహన రావడం లేదు. ఇప్పుడున్న వీరు కూడా అదనపు బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కావడం లేదు. ఒక్క ఓఅండ్ఎం ఈఎన్సీ తప్పితే జనరల్, అడ్మిన్ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా వారికి ఆయా విభాగాల మీద పూర్తిస్థాయిలో అవగాహన సైతం రాలేదు. ఈ క్రమంలో వీరిని ఇలాగే కొనసాగిస్తారా..? మార్పులు ఏమైనా ఉంటాయా..? అన్న చర్చ డిపార్ట్‌మెంటులో కొనసాగుతున్నది.






