TG Govt.: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై సర్కార్ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-15 03:16:42  IST  )

ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

TG Govt.: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపై సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్థిక సాయం అందించాలని ఆయా సంస్థలకు రిక్వెస్ట్ చేయనుంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ మేరకు అప్పీలు చేయనున్నట్లు తెలిసింది. వచ్చే అకడమిక్ ఇయర్‌లో 55 స్కూళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించింది. మిగతా స్కూళ్ల నిర్మాణం కోసం దాతల నుంచి ఆర్థిక వనరులను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నది.

కార్పొరేట్ సాయం కోసం ప్లాన్

నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డింగ్స్ నిర్మించేందుకు డిజైన్ ఫైనల్ చేశారు. డిజిటల్ విద్యాబోధన చేసేందుకు అనువైన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, మినియాప్ థియేటర్ తోపాటు విశాలమైన క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు. అక్కడే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు. వీటన్నింటి కోసం ఒక్కో స్కూల్ నిర్మాణానికి సుమారు రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అందుకోసం రూ.20 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని లెక్కలు వేశారు. ప్రస్తుతమున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఆ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించడం కష్టమనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ సంస్థల నుంచి సామాజిక బాధ్యత కింద నిధులను సేకరించాలనుకుంటున్నారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.

రెడీగా సింగరేణి!

ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి తన వంతుగా సాయం చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన తరువాత ఆ సంస్థ తన వంతు సాయంగా దాదాపు రెండు, మూడు స్కూల్స్ నిర్మాణం కోసం కావాల్సిన నిధులను కేటాయించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని పలు బయోమెడికల్, ఐటీ కంపెనీలు, ఇండస్ర్టీలు.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

వచ్చే ఏడాది 55 స్కూల్స్

వచ్చే అకడమిక్ ఇయర్ (2026–27) నాటికి 55 స్కూల్స్ ను నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం ఈ మధ్యే రూ.11 వేల కోట్లను కేటాయించింది. మిగతా స్కూల్స్ ఆ తరువాత ఏడాదిలో పూర్తి చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నది. ప్రభుత్వ భూమిలోని స్కూల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 25 ఎకరాల భూమి తప్పనిసరిగా ఉండాలని, ఒకవేళ కొంత భూమి తక్కువైతే పక్కనున్న ప్రైవేటు భూమిని సేకరించాలని భావిస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా మధిర, కొడంగల్, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించింది.

Read More..

Formula E Race: మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-రేస్‌ కేసు.. వారికి మరోసారి నోటీసులు ఇచ్చే చాన్స్

Next Story