సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టండి..  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్‌కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించాలని పేర్కొన్నారు.

మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్‌లో పరిస్థితులపై పూర్తి స్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రాంతాల వారీగా హాస్టళ్లను సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో లింక్ చేయాలని అధికారులకు సూచించారు. తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి.. ప్రతి నెలా గ్రీన్ ఛానల్‌లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story