జీహెచ్ఎంసీ ఒప్పందమేనా?

by velandi.Saikiran |   (  Updated:2026-02-14 01:44:59  IST  )

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ, రవాణా, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది.

జీహెచ్ఎంసీ ఒప్పందమేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుధ్య నిర్వహణ కీలకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు పారిశుధ్య నిర్వహణపై ఫోకస్ పెట్టారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లలో జీహెచ్ఎంసీ అగ్రిమెంట్‌నే అమలు చేస్తారా? కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటారా? అనే విషయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఒప్పందం ఇలా..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో చెత్త సేకరణ, రవాణా, జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్వహణ కోసం 2009లో రాంకీ సంస్థతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాంకీ నిత్యం ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలి. ఒప్పందం ప్రకారం మెట్రిక్ టన్నుకు రూ.1,800 చెల్లించాలని నిర్ణయించారు. అయితే మొదట్లో డంపింగ్ యార్డు, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం ఫీజు మాత్రమే ఇచ్చేవారు. కానీ క్రమంగా చెత్త రవాణా 20 శాతం, డంపింగ్ యార్డులో చెత్త నిల్వ, శాస్త్రీయ విధానంలో నిర్వహణకు 40 శాతం, రోడ్లపై ఉన్న చెత్తను సైతం తరలించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి 30 శాతం మొత్తం 90 శాతం రాంకీ చేతికి వెళ్లిపోయింది.

ఏడాదికి రూ.680 కోట్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజూ 7వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోం ది. 27 యూఎల్బీలను విలీనం చేయడంతో 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో చె త్త ఉత్పత్తి 9 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిం ది. చెత్త రవాణా 20 శాతం, రోడ్లు, జీవీపీ పాయింట్లలోని చెత్త రవాణాకు 30 శాతం, డంపింగ్ యార్డు నిర్వహణ, సైంటిఫిక్ డిస్పోజల్ 40 శాతం కార్యక్రమాలను రాంకీ సంస్థనే నిర్వహిస్తోంది. ఈ మెట్రిక్ టన్నుకు రూ.2,345 లో రాంకీ సంస్థకు రూ.2,110 చెల్లించాలి. అంటే ప్రతిరోజూ 9వేల మెట్రిక్ టన్నులకు సుమారు రూ.1.90 కోట్లు అవుతోంది. నెలకు రూ.57 కోట్లు, ఏడాదికి రూ.684 కోట్లు అవుతోంది.

10 శాతం పేరుతో..

జీహెచ్ఎంసీతో రాంకీ చేసుకున్న ఒప్పందం 10 శాతం కార్యక్రమాలను మినహాయిస్తే 90 శాతం కార్యక్రమాలను రాంకీ సంస్థకు జీహెచ్ఎంసీ అప్పగించింది. ఈ 10 శాతం సాకుతో చెత్తసేకరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని తీసుకోవడానికి రాంకీ ఆసక్తి చూపడంలేదు.

కొత్త కార్పొరేషన్లలో..

జీహెచ్ఎంసీతోపాటు కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా ఏర్పాటు చేశారు. వీటిలో జీహెచ్ఎంసీ అగ్రిమెంట్‌నే అమలు చేస్తారా? కొత్తగా అగ్రిమెంట్లు చేసుకుంటారా? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. రాంకీ విషయంపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మూడు కార్పొరేషన్ల అధికారులు, రాంకీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ‘అగ్రిమెంట్ ప్రకారం ఇంటింటి చెత్త సేకరణ చేస్తారా? లేదా? చేస్తే ఎప్పటి నుంచి చేస్తారు? చేయకపోతే ఎందుకు చేయరో స్పష్టత ఇవ్వండి’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి స్పందించిన రాంకీ ప్రతినిధులు వారం రోజుల్లో ప్రతిపాదనలను అందజేస్తామని ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది. అయితే రాంకీ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Next Story