పెరగనున్న విద్యుత్ భారం.. ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చయింది: జెన్‌కో సీఎండీ

by Disha Web Desk 2 |
పెరగనున్న విద్యుత్ భారం.. ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చయింది: జెన్‌కో సీఎండీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై జెన్‌కో చైర్మన్ ప్రభాకర్ రావు మంగళవారం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గరిష్టంగా మంగళవారం మధ్యాహ్నం 14,794 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడడంతో రానున్న రోజుల్లో అది 16 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే విద్యుత్ అవసరాల కోసం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, ఇకపైన అది రూ. 1500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. అనుకున్న విధంగా నవంబరులో ఎన్టీపీసీ యూనిట్ ప్రారంభం కావాల్సి ఉన్నదని, కానీ కొన్ని కారణాలతో అది వాయిదా పడడంతో పవర్ ఎక్ఛేంజి నుంచి కొనుక్కోవాల్సి వస్తున్నదన్నారు. దీంతో డిస్కంలపై అదనపు భారం పడుతున్నదని, మరో మరాగం లేదన్నారు. ఎన్టీపీసీ నుంచి విద్యుత్ వస్తే కొనుగోలు భారం తప్పేదన్నారు.

వేసవి కాలంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాఖాపరంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా గురించి అధికారులతో చర్చించి తగిన ఆదేశాలను ఇచ్చినట్లు ప్రభాకర్ రావు మీడియాకు వివరించారు. గతేడాదికంటే ఈసారి ఇప్పటికే సుమారు 30% మేర విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానికి సుమారు 30% ఖర్చవుతున్నదని, మరో 20% పరిశ్రమలకు అవుతున్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వేసవిలో విద్యుత్ వినియోగం తారస్థాయికి చేరుకుంటుందని ఊహించినదే అయినా ఫిబ్రవరిలోనే అది చోటుచేసుకోవడంతో అప్రమత్తం కావాల్సి వచ్చిందన్నారు. ఒక్క రోజులోనే 290 మిలియన్ యూనిట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 300 మిలియన్ యూనిట్లతోపాటు 16 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ రావచ్చన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed