మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన టీమ్

by Ramesh Naini |

ఫేమస్ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి.

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫేమస్ ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘మధ్యాహ్న భోజన పథకం’పై చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అయితే, ఈ వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి బృందం స్పష్టం చేసింది.

వైరల్ వీడియోలో ఏముంది?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, బట్టలు వంటివన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల వారిలో క్రమశిక్షణ, చదువుపై శ్రద్ధ తగ్గుతున్నాయని గరికపాటి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన వృత్తి అయిన బోధనను వదిలేసి, మధ్యాహ్న భోజనం వండించడం, గుడ్ల లెక్కలు రాయడానికే సమయం కేటాయిస్తున్నారని ఆయన విమర్శించినట్లు ఆ వీడియోలో ఉంది. విద్యాసంస్థలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాల్సింది పోయి, కేవలం భోజనశాలలుగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వక్రీకరించారంటున్న గరికపాటి టీమ్

ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు బృందం తక్షణమే స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఇలా మాట్లాడలేదని, పాత వీడియోలోని మాటలను కలగలిపి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గరికపాటి ఎప్పుడూ పేదల పక్షమేనని, ధనవంతులు తమ ఔదార్యంతో పేద విద్యార్థులకు పాలు, పౌష్టికాహారం, దుప్పట్లు దానం చేయాలని వందల సార్లు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని, అంతేకానీ పథకాన్ని కించపరచడం వారి ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. హిందూ ధర్మ స్ఫూర్తితో ఉన్న పేదలను ఆయనకు దూరం చేసేందుకు కొంతమంది మూర్ఖులు చేస్తున్న కుతంత్రమిదని, ఇటువంటి వాటిని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ఈ అంశంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఒక వరమని, దానిని విమర్శించడం సరికాదని కొందరు అంటుండగా.. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరుగుతోందన్న గరికపాటి మాటల్లో వాస్తవం ఉందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా, విద్యా వ్యవస్థలో ఉండాల్సిన మార్పుల గురించి ఆయన చేసిన సూచనలను సానుకూల దృక్పథంతో చూడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

Next Story