ఐటీ ఉద్యోగుల మత్తు వదిలిస్తోన్న ఈగల్ టీమ్..

by Naga Rani Yarlagadda |

డ్రగ్స్ మత్తులో ఐటీ ఉద్యోగులు ఊగిపోతున్నారు. ఒకవైపు డ్రగ్స్ కు బానిసగా మారుతూనే, మరోవైపు డ్రగ్స్ సరఫరాలో కీలకంగా పనిచేస్తున్నారు.

ఐటీ ఉద్యోగుల మత్తు వదిలిస్తోన్న ఈగల్ టీమ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ మత్తులో ఐటీ ఉద్యోగులు ఊగిపోతున్నారు. ఒకవైపు డ్రగ్స్ కు బానిసగా మారుతూనే, మరోవైపు డ్రగ్స్ సరఫరాలో కీలకంగా పనిచేస్తున్నారు. ఉద్యోగ ఒత్తిడి నుంచి రిలాక్స్ కోసమని అలవాటు చేసుకున్న డ్రగ్స్, వారికి క్రమంగా వ్యసనంగా మారడంతో టెకీల జీవితాలు తలకిందులవుతున్నాయి. కుటుంబ సమస్యల కారణంగా కొందరు మత్తుకు బానిసలువుతున్నట్లు ఇటీవల పోలీసులు చేపట్టిన దాడుల సందర్భంలో వెల్లడయ్యింది. డ్రగ్స్ ఎడిక్టర్ గా మారిన కొందరు టెకీలు ఆర్ధిక అవసరాలకు డ్రగ్స్ సప్లయిర్స్ గా మారుతున్నారు. ఇటీవల ప్రభుత్వం డ్రగ్స్ వినియోగం నివారణకు ప్రత్యేకంగా ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. ఈగల్ టీం చేపట్టిన తనిఖీలలో అత్యధికంగా ఐటీ ఉద్యోగులు పట్టుబడుతుండటం గమనార్హం.

ఈగల్ టీం గచ్చిబౌలి ప్రాంతంలో జూలై 13న చేపట్టిన ఆపరేషన్ భాయ్ అగయాలో తొలుత 14 మంది పట్టుబడ్డారు. వారిలో ఆరుగురు ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ గా తేలింది. వారు100 మంది సభ్యులతో వాట్సాప్ గ్రూప్ క్రియోట్ చేసి, గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించే పనిలో పడ్డారు. కొద్ది రోజులగా డ్రగ్స్ ప్లెడ్లర్స్, గంజాయి సప్లయిర్స్ పై ఈగల్ టీం చేపట్టిన నిఘాలో 600 మంది ఐటీ ఉద్యోగులను డ్రగ్స్ ఎడిక్టర్స్ గా గుర్తించారు. వారికి నోటీసులు అందజేసి, వారిని విచారిస్తున్నారు.

గంజాయి అమ్మాకాలకు యాప్, వాట్సప్ గ్రూపులు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా సంపాదిస్తున్న జీతం సరిపోలేదంటూ ఓ ఐటీ ఎంప్లాయి గంజాయి అమ్మకాలకు దిగాడు. మల్లేపల్లి పరిధిలో నివాసం ఉంటున్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అతని స్నేహితునితో కలిసి గంజాయి అమ్మకాలు చేస్తుండగా, జూలై 4 వ తేదీన ఎస్‌‌టీఫ్ టీం వారిని అరెస్ట్ చేసింది. ఓ యాప్‌ ద్వారా డ్రగ్స్ బుక్‌ చేసుకొని, నారాయణగూడ ప్రాంతంలో అమ్మకాలు చేస్తుండగా ఎస్‌టీఎఫ్‌ బృందం వారిని పట్టుకుంది. నిందితుడి నుంచి 500 గ్రాముల గంజాయి, కారు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విదేశీ గంజాయి అమ్మకాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీ గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ మేనెలలో పట్టుకుంది. అతని నుంచి అమెరికాలో లభ్యమయ్యే ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. విదేశాలలో లభ్యమయ్యే డ్రగ్స్ హైదరాబాద్ లో లభ్యం కావడంతో ఎస్‌టీఎఫ్ టీం అవాక్కయింది. యూఎస్‌ఏ కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో ఓజీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారని సమాచారం. ఈ హై క్వాలిటీ గంజాయిలో మత్తుకు కారకమయ్యే టెట్రా హైడ్రో క్యాన్బినాన్ అనే పదర్థాన్ని మిక్స్ చేస్తున్నారని గతంలో గుర్తించారు. మన దగ్గర దొరికే సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం టెట్రా హైడ్రో క్యాన్బినాన్ ఉంటే, ఓజీ కుష్ గంజాయిలో అది 25 శాతం ఉంటుందని తేలింది. ఈ గంజాయి ఒక గ్రాము రూ.3వేలకు ఉంటుందని ఎస్‌టీఎఫ్ చెబుతోంది.

ఒరిస్సా వయా భద్రాచలం టూ హైదరాబాద్ ..

ఒరిస్సా నుంచి వయా భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రాచలం వద్ద గురువారం ఎస్‌టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఐటీ ఉద్యోగులకు సరఫరా చేసేందుకు గంజాయి తీసుకువెళ్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. వారు ఓ ఐటీ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ ఉద్యోగులు నిత్యం తమను గంజాయి అడగడంతో ఒరిస్సాలో దానిని కొనుగోలు చేశామని, దానిని హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాధాపూర్ ఐటీ కారిడార్ లో అమ్ముతున్నట్లు నిందితులు తెలిపారు.

Next Story