- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకెన్నాళ్లీ దళారీ వ్యవస్థ.. ? మార్కెట్ ఫీజు తప్పించుకునేందుకు బయటే అమ్మకాలు
దళారీ వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ యథేచ్ఛగా తమ ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.

దిశ, చైతన్యపురి : దళారీ వ్యవస్థ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ యథేచ్ఛగా తమ ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
రోడ్డుపై వ్యాపారం చేస్తున్నా..
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ పరిధిలో దళానీ వ్యవస్థను రూపుమాపడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మార్కెట్ ఫీజు ఎగదోయడానికి మార్కెట్ లోపల చేయాల్సిన వ్యాపారం వెలుపల రోడ్లపై చేస్తున్నా పాలకవర్గం మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. బయటే కూరగాయలు దళారీలు అమ్ముతున్నారు. దాంతో లోపల ఉన్న రైతులకు, వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
మార్కెటింగ్ శాఖ అధికారుల ఉదాసీన వైఖరివల్లనే ఇదంతా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. సెక్రటరీ, పాలకవర్గాల నిర్ణయం వల్ల మార్కెట్ కు రావాల్సిన ఆదాయం రాకపోవడం, లోపల అనధికారికంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కమిషన్ ఏజెంట్లు రైతుల నుండి అధికఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కోల్డ్ స్టోరేజ్ తొలగించకుండా..
మార్కెట్ స్థలం మొత్తం 12 ఎకరాలు ఉంది. మూడు ఎకరాలలో కోల్డ్ స్టోరేజీ ఉంది. రైతులందరికీ స్థలం సరిపడక బయట కూరగాయలు విక్రయిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ తొలగించాలని గత పాలకమండలి తీర్మానం చేసినా నేటివరకు తొలగించలేదు. కోల్డ్ స్టోరేజీలు ఒకరికి 30 ఏళ్లు, మరొకరికి 25 ఏళ్లు లీజుకు ఇస్తూ ఉన్నతాధికారులు జీవో విడుదల చేశారని మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ తెలిపారు. గత పాలకవర్గం చేసిన తీర్మానాన్ని ఉన్నతాధికారులు ఆమోదించాలని తమ పరిధిలో లేదని ఆయన పేర్కొన్నారు.
లోపించిన పరిశుభ్రత..
మార్కెట్ లో పరిశుభ్రత కనిపించడం లేదు. శానిటేషన్ సిబ్బంది సకాలంలో క్లీన్ చేయడం లేదు. దీంతో దుర్గందం వస్తోంది. కుళ్ళిన కూరగాయలు తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులకు మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం లేదు. లోపల నర్సరీ అమ్మకానికి అనుమతి లేదని పలువురు చెబుతున్నారు. సెక్రటరీ, పాలకవర్గం కనుసన్నల్లో అనుమతి లేకుండా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
నిబంధనల మేరకే జరుగుతున్నాయి..
మార్కెట్ లోపల అన్ని నిబంధనలు మేరకే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. నర్సరీ విక్రయించే వ్యక్తి నెలకు రూ. 5 వేలు చెల్లిస్తున్నారు. బయట ఉన్న దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి పాలకవర్గంతో చర్చించినట్లు తెలిపారు. త్వరలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
- శ్రీనివాస్, మార్కెట్ కార్యదర్శి గడ్డి అన్నారం
ఫీజు ఎగదోయడానికి బయటే అమ్మకాలు
మార్కెట్ ఫీజు ఎగదోయడానికి కొంతమంది దళారులు బయట కూరగాయలు అమ్ముతున్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. అసలైన రైతులకు నష్టం జరుగుతుంది. మార్కెట్ ను ప్రక్షాళన చేయాలి. లోపల ఉన్న కోల్డ్ స్టోరేజీలు తొలగిస్తే స్థలం అందరికీ సరిపోతుంది. బయట అమ్మకాలు తగ్గుతాయి.
- డాక్టర్ వీరమల్ల రామ నరసింహ గౌడ్, మాజీ చైర్మన్. గడ్డి అన్నారం ఏఎంసీ






