- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి.. SECని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 50 శాతం రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 50 శాతం రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం.పద్మనాభరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిండాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తుందని అన్నారు. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా పంచాయితీ ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ల సమస్య అడ్డంకిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9 న్యాయ పరీక్షలో నిలువలేదన్నారు. దీంతో రిజర్వేషన్ల జగడం ఇంతలో తేలే సూచనలు కనపించడం లేదని తెలిపారు. ఈ వ్యవహారం తేలే వరకు ఎన్నికలు జరుపకపోవడం అంటే పంచాయితీలను నిర్వీర్యం చేసినట్లేనని పద్మనాభరెడ్డి కామెంట్ చేశారు.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి అక్కర్లేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అనుకరణ 243 (K) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు గ్రామ పంచాయితీ ఎన్నికలు జరపడానికి విస్తృతమైన అధికారాలు కల్పించారని తెలిపారు. ముఖ్యంగా ఓటరు లిస్టు తయారీ, ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి విశేషమైన అధికారులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటు వంటి అనుమతులు తీసుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయితీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వహించలేకపోతుంది అన్న భావన ప్రజల్లో నెలకొన్నదని పద్మనాభరెడ్డి తెలిపారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపక పోవడంతో పంచాయితీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయని పద్మనాభరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో గ్రామాలలో ప్రజలకు అవసరమైన పౌర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. గ్రామ పంచాయితీలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లతో పంచాయితీ ఎన్నికలు ముడిపెట్టడంతో సమస్య మొదలైందని, ఈ 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించిన తీర్పు ప్రకారం ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వ అనుమతి కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కల్పించిన అధికారాలతో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే సెప్టెంబరు చివరి నాటికి ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగం కల్పించిన అధికారాలు వినియోగించుకోకుండా ప్రభుత్వములో ఒక శాఖగా పనిచేస్తుందని పద్మనాభరెడ్డి ఆరోపించారు.






