బఫర్‌జోన్‌లో భారీ నిర్మాణాలు.. అతని తండ్రిని చూసి వెనకడుగేస్తోన్న హైడ్రా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-24 03:17:22  IST  )

హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు బడా బాబుల చేతుల్లో ఆక్రమణలకు గురవుతున్నాయి. జలాశయాలను పూడ్చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

బఫర్‌జోన్‌లో భారీ నిర్మాణాలు.. అతని తండ్రిని చూసి వెనకడుగేస్తోన్న హైడ్రా?
X

దిశ, మేడ్చల్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు బడా బాబుల చేతుల్లో ఆక్రమణలకు గురవుతున్నాయి. జలాశయాలను పూడ్చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తరహాలోనే బఫర్ జోన్ లో ఉన్న భూములపై మాజీమంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి కన్నుపడింది. ఇంకేముంది భారీ అపార్ట్ మెంట్లను నిర్మిస్తున్నాడు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు బఫర్ జోన్ సర్వేనెంబర్ 151, 179లో భద్రారెడ్డి నిర్మాణాలు చేపడుతున్నాడు. 2014లో రూపొందించిన ఫాక్స్ సాగర్ చెరువు కోఆర్డినెన్స్ అనుసరించి నెంబర్ 60 నుంచి 64లో ఉన్న చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో చామకూర భద్రారెడ్డి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నారు. శ్రీ షిరిడీ సాయి బిల్డర్స్ సంస్థ వారు ‘కృష్ణాస్ ఎమ్రాల్డ్’ పేరుతో అపార్ట్ మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది చెరువు బఫర్ జోన్ లోకి వస్తున్న విషయం కచ్చితంగా తెలుసుకున్న హైడ్రా మాత్రం ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు. ఎగువ ప్రాంతంలో ఉన్న లింగయ్యకుంట చెరువు నాలాగా పేర్కొంటూ తప్పుడు నివేదికల ద్వారా ఇరిగేషన్ అధికారులు ఎన్ వోసీ జారీచేశారు. ఈ విషయం ప్రస్తుత ఫాక్స్ సాగర్ చెరువు మ్యాపులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

రికార్డులు ఏం చెబుతున్నాయి?

రికార్డుల ప్రకారం జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు 462 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉన్నది. మూడు గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు కొంపల్లి మున్సిపాలిటీ, కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లతో పాటు 151, 179లోనూ కొంతమేర ఉంది. ఈ విషయాన్ని 2014లో నిర్వహించిన సర్వే ఆఫ్ లేక్స్ ప్రాజెక్టులో భాగంగా నిర్ధారించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏలో కూడా ఇదే రికార్డు ఉన్నది. దీని ప్రకారం ప్రస్తుతం చెరువులో నిర్మిస్తున్న శ్రీషిరిడీ సాయి బిల్డర్స్ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్నది. చెరువు కోఆర్డినెన్స్ 61 నుంచి 64లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండానే 2021లో అప్పటి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసి మరి అప్పటి మంత్రి మల్లారెడ్డి కొడుకు చామకూర భద్రారెడ్డి నిర్మిస్తున్న భవనానికి గుడ్డిగా ఎన్‌వోసీ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో 30 మీటర్లు ఉండాల్సిన చెరువు బఫర్ జోన్ కాస్త కేవలం 9మీటర్లగా కుంచించుకుపోయింది. దీని ప్రకారమే బఫర్ జోన్ మార్కింగ్ చేసి ఎన్ఓసీ ఇచ్చేశారని చెబుతున్నారు.

‘హైడ్రా’ పట్టించుకోదా?

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి మండలం ఎర్రకుంట చెరువు బఫర్ జోన్ లో వెలిసిన అపార్ట్ మెంట్లను హైడ్రా కూల్చివేసింది. అలాగే మల్లంపేటలో లక్ష్మీశ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ వారు చెరువు భూమిలో చేపట్టిన నిర్మాణాలను సైతం నేలమట్టం చేశారు. దుండిగల్ మండలం కుడికుంట చెరువు వద్ద ఉన్న నిర్మాణ పనులను హైడ్రా అధికారులు అప్పట్లో ఆపించేశారు. గాజులరామారంలో వందలాది రేకుల రూములను కూలగొట్టి అక్కడ ఉన్న వారిని బయటికి పంపించారు. ఇలా అనేక సందర్భా్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. గాజులరామారం చెరువు బఫర్ జోన్ తో పాటు ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ఏర్పాటు చేసుకున్న రేకులషెడ్ల నిర్మాణాలను కూల్చివేశారు. కూకట్ పల్లి ప్రాంతంలో కూడా చెరువులో ఉన్న నిర్మాణాలను ఇదే తరహాలో తొలగించారు. పలు సందర్భా్ల్లో చెరువు భూమిలో నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేయడం తెలిసిందే. జాయింట్ సర్వే రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా ఫాక్స్ సాగర్ చెరువులో మాజీమంత్రి సి.మల్లారెడ్డి తనయుడు చామకూర భద్రారెడ్డి చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story