Harish Rao: సన్న బియ్యంలో 50% నూకలే.. మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంలో 40 నుంచి 50 శాతం నూకలు ఉంటున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు

Harish Rao: సన్న బియ్యంలో 50% నూకలే.. మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంలో 40 నుంచి 50 శాతం నూకలు ఉంటున్నాయని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని, ఇచ్చిన మాట ప్రకారం, మంచి మంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేసిన 3 నెలల కోటా సన్న బియ్యంలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త కార్డులు ఇస్తూ ఉంటారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం ఇస్తే, బీఆర్ఎస్ ఆరు కేజీల బియ్యం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం అందించి, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కలిసి కృషి చేద్దామని చెప్పారు.

Next Story