ఒక్క విద్యార్థిపై పోలీస్ లాఠీ పడినా సమాజం ఊరుకోదు.. సీఎం ఓయూ పర్యటనపై హరీశ్‌రావు వార్నింగ్

by Ramesh Naini |

ఒక్క విద్యార్థి మీద పోలీసుల లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

ఒక్క విద్యార్థిపై పోలీస్ లాఠీ పడినా సమాజం ఊరుకోదు.. సీఎం ఓయూ పర్యటనపై హరీశ్‌రావు వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఒక్క విద్యార్థి మీద పోలీసుల లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. ఇందుకేనా విద్యాశాఖను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నదని అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్య అని ఆయన ఇవాళ ఒక ప్రకటనలో ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తోందన్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని నిలదీశారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను రేవంత్ రెడ్డి తిరిగి తెచ్చిండని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం, కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారని, 22 నెలల్లో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నావు అని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావని విమర్శించారు.

గ్రంథాలయాల్లో పోలీసుల లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని, ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని అన్నారు. (Osmania University) ఉస్మానియా విద్యార్థి, నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారని హెచ్చరించారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story