- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే.. అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి.. మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్
అసెంబ్లీ సమావేశాలను దమ్ముంటే 15 రోజుల పాటు నిర్వహించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలను దమ్ముంటే 15 రోజుల పాటు నిర్వహించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించినట్లుగానే అసెంబ్లీని భ్రష్టుపట్టించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదటి టర్మ్‌లో ఏడాదికి 32 రోజులు అసెంబ్లీని నడిపామని.. కాంగ్రెస్ రెండేళ్లలో 40 రోజులు మాత్రమే నడిపారని పేర్కొన్నారు. సగటున 20 రోజులు కూడా సమావేశాలు పెట్టడం లేదన్నారు. ఏడాదికి 45 రోజులు అసెంబ్లీ పెట్టాలని ఒకప్పుడు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేడు 20 రోజులకు కుదించిందని ఆరోపించారు. ప్రతిపక్షంపై బురదజల్లడానికి సమావేశాలు పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదని అన్నారు. అసెంబ్లీని నడపడానికి ప్రభుత్వం భయపడుతున్నదని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క అంశంపైనా చర్చ పెట్టకపోతే అసెంబ్లీని నడిపి ఎందుకు? అని ప్రశ్నించారు. అంగబలం, మందబలంతోనే కాంగ్రెస్ సభను నడిపిస్తున్నదని దుయ్యబట్టారు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీని నడుపుతామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఎందుకు వెనక్కి పోతున్నారని నిలదీశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఏం చర్చ పెట్టినా మాట్లాడతామని.. తాము పూర్తిగా ప్రిపేర్ అయ్యామని వెల్లడించారు. మీలాగా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి రాము అని అన్నారు.
45 టీఎంసీల కోసం లేఖ రాశారా? లేదా?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారని హరీశ్‌రావు ఆరోపించారు. 45 టీఎంసీలు చాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినప్పుడల్లా అసెంబ్లీని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కేసీఆర్ బయటకు వచ్చి పోరాటం చేశారని తెలిపారు. అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకొని నిర్ణయాన్ని వాపస్ తీసుకుని తీర్మానం చేశారని అన్నారు. మరోవైపు.. 45 టీఎంసీలతో ఏ జిల్లాను ఎండబెడతారని ప్రశ్నించారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు మూడు జిల్లాలో ఏ జిల్లాకు అన్యాయం చేస్తారని నిలదీశారు. ఏడాది కింద డీపీఆర్ వాపస్ వస్తే ఇప్పటివరకు ఎందుకు తిరిగి సబ్మిట్ చేయలేదని.. ఇదే విషయాన్ని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారని అన్నారు. దానికి సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని అభాండాలకు సభలోనే సమాధానం చెబుతామని.. 299 టీఎంసీలకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
ఆధారాలతో తప్పిదాలను చూపుతాం
ఆధారాలతో సహా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతామన్నారు. 299 టీఎంసీలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌లో తాము ఫిర్యాదు చేశామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం 32 లేఖలు రాసిందని వెల్లడించారు. కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ హౌస్ కమిటీలు ఇప్పటివరకు వేయలేదని.. లోపం స్పీకర్ వద్ద ఉన్నదా? లేక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దగ్గర ఉన్నదా? అని ప్రశ్నించారు. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా ఉత్తమ్ పద్మావతిరెడ్డిని నియమిస్తే వెంటనే రాజీనామా చేశారని.. అసలు ఎస్టిమేట్స్ కమిటీకి ఎన్నికనే జరగలేదని.. పీఏసీ చైర్మన్ పదవికి బ్యాక్ గేట్ నుంచి నామినేషన్లు తీసుకుని చైర్మన్‌ను ఎంపిక చేశారని ఆరోపించారు. ఎరువుల కొరత, రైతు బంధు ఎగ్గొట్టిన దానిపై, రుణమాఫీ, పంట బోనస్‌పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ కుంభకోణంపై, జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలన్నారు. రేవంత్‌రెడ్డికి ఫుట్ బాల్ సోకులు అని.. కోఠీ, కొండాపూర్ ఆస్పత్రుల్లో గురకుల పాఠశాలల విద్యార్థులు ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇస్తే.. బీఆర్ఎస్‌కు సైతం ఇవ్వాలని కోరుతామని చెప్పారు. హుందా అనే పదం కాంగ్రెస్ పార్టీకి పలికే అర్హత లేదని.. అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని చిల్లర, చిచోరా భాష రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు.






