మాపై నిందలు ఎవరి లాభం కోసం? కవిత వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

మాపై నిందలు ఎవరి లాభం కోసం? కవిత వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రాలేదు అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు అవాస్తవం అని శుక్రవారం ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. BRS ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను నిజామాబాద్ జిల్లాలోని SRSP ప్రాజెక్ట్ లోకి, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి తీసుకువచ్చి నింపామన్నారు. నిజామాబాద్ జిల్లాలోని SRSP ప్రాజెక్టు లోకిపై నుంచి నీరు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కింది నుంచి తీసుకువచ్చి ఎస్సారెస్పీ నింపే కార్యక్రమం SRSP పునరుజ్జీవం ప్రాజెక్టు దాదాపు 1900 కోట్లతో BRS ప్రభుత్వం హాయంలోనే పూర్తి చేసి ఎస్సారెస్పీ లోకి కింద నుండి రివర్స్ పంపింగ్ చేసి వరద కాలువ ద్వారా నీళ్లు తెచ్చామని అన్నారు.

ఈ దృశ్యం జిల్లా ప్రజలు చూశారు. తర్వాత వర్షాలు బాగా పడటం వల్ల మళ్ళీ ఆ అవసరం రాలేదన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నుంచి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ కట్టిన కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్యాకేజీ 21 పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే 70 శాతం పూర్తయిందన్నారు. ప్యాకేజీ 21 లో బినోల దగ్గర హెడ్ వర్క్స్, సొరంగ మార్గం, సారంగాపూర్ పంప్ హౌస్, మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ పూర్తయి.. 21A లో మెయిన్ పైప్ లైన్ కూడా పూర్తయి కప్పల వాగు, పెద్దవాగులో కాళేశ్వరం నీళ్లు పోయించామని అన్నారు. అది అక్కడి రైతులందరు కండ్లార చూశారని వివరించారు.

మొన్న సీజన్ లో నీళ్లు కావాలని భీంగల్ రైతులు అడిగితే ఈ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 21 B లో సొరంగ మార్గం, మంచిప్ప పంప్ హౌస్, 70% మెయిన్ పైప్ లైన్ పనులు BRS హయాంలోనే పూర్తి అయిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే ఎమ్మెల్సీ కవిత మిగిలి ఉన్న కొన్ని పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నీలదీయాల్సింది పోయి గత BRS ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు, మాపై నిందలు వేయడం ఎవరి లాభం కోసం చేస్తున్నారో కవిత ఆత్మ విమర్శ చేసుకోవాలి.. అని హితువు పలికారు.

Next Story