- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ పత్తి విత్తనాలపై ఫోకస్.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు, హెచ్‌టీ కాటన్ సీడ్స్‌ను వ్యాపారులు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు, హెచ్‌టీ కాటన్ సీడ్స్‌ను వ్యాపారులు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కంపెనీ పేరు లేకుండా తక్కువగా ధరకు వీటిని విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నది. అయితే నకిలీ విత్తనాలపై వరుస ఫిర్యాదులు వస్తుండడంతో కట్టడికి రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఏడాది కాలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పలు కేసులు నమోదైనా.. దళారులు మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో పలు జిల్లాల్లో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ టీమ్స్ విత్త దుకాణాలతో పాటు విడివిడిగా విత్తన విక్రయాలు చేసే వారిపై కన్నేయనుంది.
మార్కెట్లోకి కంపెనీ పేరు లేని విత్తనాలు
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం సుమారు 89 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరాచేయనున్నారు. అయితే ప్రతిసారి మాదిరిగానే మార్కెట్లోకి లూజ్ పత్తి విత్తనాలు విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొన్ని రకాల విత్తనాలు రంగురంగుల ప్యాకెట్లలో అమ్మకాలు చేస్తున్నట్టుగా రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ విత్తనాలు ఎక్కువగా ఏపీ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలైన నల్లగొండ, యాద్రాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి సరఫరా చేసి విక్రయాలు చేయిస్తున్నట్టుగా పేర్కొంటున్నాయి. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తున్నది. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన హెచ్ టీ విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ విత్తనాలతో భూసారం తింటుంది. ఏపుగా పెరిగినా కాత తక్కువగా ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు హెచ్ టీ విత్తనాలు వేస్తే భూమిలో కలుపు సమస్య ఉండదని ప్రచారం చేస్తూ రైతులకు అంటగడుతున్నారు.
ప్రత్యేక బృందాలు
నకిలీ విత్తనాలతో పాటు హెచ్ టీ రకం విత్తనాల కట్టడికి వ్యవసాయ శాఖ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అందులో ఏడీఏతోపాటు పోలీసు, ఏఈవోలు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలు విడివిడిగా మండలాలకు వెళ్లి విత్తనాల అమ్మకాలు నిఘా పెట్టనుంది. రైతులకు నకిలీ విత్తనం అమ్మినట్లే తేలితే వెంటనే కేసు నమోదు చేస్తారు. వారి దగ్గర ఎన్ని క్వింటాళ్ల నకిలీ విత్తనాలు ఉన్నాయో గుర్తించి వెంటనే సీజ్చేస్తారు.
వ్యవసాయ శాఖ సూచనలు
* లైసెన్స్ డ్ డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలి.
* బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. రశీదు పై డీలర్, రైతు సంతకాలు ఉండాలి.
* గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయించే, బిల్లులు ఇవ్వని వ్యాపారుల గురించి వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వాలి.
* బీటీ త్రీ పత్తి విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి






