పొలాల్లో నిప్పు.. అన్నదాత ప్రాణాలకు ముప్పు! వరి కొయ్యల అగ్గితో బూడిదవుతున్న భూసారం

by Kema Shiva Kumar |

తెలంగాణలో వరి కొయ్యల కాల్చివేత అత్యం ప్రమాదకరంగా మారుతున్నది.

పొలాల్లో నిప్పు.. అన్నదాత ప్రాణాలకు ముప్పు! వరి కొయ్యల అగ్గితో బూడిదవుతున్న భూసారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పని భారాన్ని తగ్గించుకోవడానికి కొందరు రైతులు ఎంచుకుంటున్న మార్గం.. ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తున్నది. మరోవైపు పర్యావరణానికి నష్టం కలిగించడమే కాకుండా.. భూములు సారం కోల్పోయి.. పెట్టుబడి ఖర్చు సైతం పెరిగిపోతున్నది. ఇటీవల వరి కొయ్యలను దున్నడానికి బదులు.. వాటిని రైతులు తగులబెడుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు కాల్చేశారు. ఆ మంటలు పక్క పొలాలు, చెట్లు, ఇతర ఆస్తులను సైతం తగలబెడుతున్నాయి. వాటి వల్ల వెలువడే పొగ కారణంగా కొందరు రైతులు చనిపోగ, కొందరు రైతులు మంటలు అంటుకుని సజీవదహనమైన ఘటనలు ఉన్నాయి. వరి కొయ్యలను తగులబెట్టవద్దని వ్యవసాయ అధికారులు, పర్యావరణ వేత్తలు ఎంత చెప్పినా.. కొందరు రైతులు వాటిని కాల్చేందుకే మొగ్గుచూపుతున్నారు.

యంత్రాలతో సమస్యలు

గతంలో వరిని కూలీల ద్వారా కొసే వారు. దీంతో భూమిపై భాగంలో కొంత వరకు మాత్రమే ఉండేది. కానీ వరి కోత మిషన్లు, గడ్డి కట్టే యంత్రాలు రావడంతో భూమి పైభాగం నుంచి కొంత ఎత్తులో కొయ్యలు మిగిలిపోతున్నాయి. దీంతోపాటుగా గడ్డి కట్టలు కట్టే సమయంలో కొంత గడ్డి పొలాల్లో మిగిలిపోతున్నది. మిషన్ల ద్వారా చేసినప్పుడు ఇలా సమస్యలు వస్తున్నాయి. కూలీల కొరత, వారికి అధిక మొత్తం చెల్లించాల్సి రావడం, వర్షాల భయం, తక్కువ సమయంలో పని పూర్తి కావడం వంటి కారణాలతో రైతులు యంత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తర్వాత వరి కొయ్యలు, గడ్డిని తొలగించలేక.. కాల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మంటలు ఇతర పొలాలకూ అంటుకుంటున్నాయి. చుట్టు పక్కల ఉన్న చెట్లు, ఇతర పంటలు, గుడిసెలు, ఇండ్లు తగలబడే ప్రమాదాన్నీ పెంచుతున్నాయి.

నష్టాలు ఇవే..

పంట అవశేషాలను కాల్చడం వల్ల వచ్చే ధూళి, పొగ వల్ల శ్యాసకోశ వ్యాధులు, కళ్ల మంట, దగ్గు, అస్తమా వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేలలోని సూక్ష్మజీవులు, పోషక పదార్ధాలు సైతం నశిస్తాయి. నేల సారం తగ్గుతుంది. దీని వల్ల ఎరువులు, పెట్టుబడి ఖర్చు పెరగడంతోపాటు దిగుబడి తగ్గుతుంది. దీని వల్ల అన్నదాతలకే అధిక నష్టం జరుగుతుంది.

ప్రత్యామ్నాయ చర్యలు

పంట అవశేషాలను కాల్చే బదులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రాక్టర్లు, రోటవేటర్ల ద్వారా అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదున్నాలి. వరి అవశేషాలను కంపోస్టు గుంటలో వేసి ఎరువుగా తయారు చేసి పొలంలో వాడుకోవచ్చు. బయోగ్యాస్ తయారీకి వాడడం ద్వారా గ్యాస్ లేదా విద్యుత్ పొందవచ్చు. ప్రత్యేక విధానంలో ప్రాసెస్ చేసి పశువుల మేతగానూ వినియోగించుకోవచ్చు.

అవగాహన కల్పించకుంటే సమస్యే

వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చడం నేరం. అలా చేస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం జరిమానా విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాలుస్తున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే సుమారు 37 వేల ఎకరాల్లో పంట అవశేషాలను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ లెక్కలు తెల్చే పనిలో నిమగ్నమయ్యారు. పంట అవశేషాలను కాల్చడం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హానికరమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు వస్తాయని, కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు రాకముందే, భవిష్యత్తులో ఈ కల్చర్ మరింత పెరగకుండా ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లాలో వరి కొయ్యలను కాల్చివేసిన వివరాలు

మండలం - ఎకరాలు

బిజినేపల్లి - 7,693

కల్వకుర్తి - 2,873

తాడూరు - 4,606

తిమ్మాజిపేట - 2,527

నాగర్ కర్నూలు - 2,436

టేకుపల్లి - 2,265

పెద్దకొత్తపల్లి - 2,111

కొడేర్- 1,947

ఉప్పుంనూతల - 1,296

అచ్చంపేట - 1,160

అమ్రాబాద్ - 1,188

వంగూరు - 1,148

వెల్డండ - 1,044

ఉర్కొండ - 1,026

Next Story