Film Chamber Awards : ఫిల్మ్ చాంబర్ అవార్డులు..గద్దర్ అవార్డులకు పోటీనా ?

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-06 10:29:42  IST  )

ప్రతి సంవత్సరం(Every Year) సొంతంగా అవార్డు(Awards)లు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తీసుకున్న నిర్ణయంపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది.

Film Chamber Awards : ఫిల్మ్ చాంబర్ అవార్డులు..గద్దర్ అవార్డులకు పోటీనా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి సంవత్సరం(Every Year) సొంతంగా అవార్డు(Awards)లు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) తీసుకున్న నిర్ణయం సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన వేడుకలు నిర్వహించాలని..ఈ వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది.

ఆ రోజు నటీ నటులు, నిర్మాతలు, ఇండస్ట్రీ వ్యక్తులు తమ ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని.. ఆ జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ చాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని చాంబర్ స్పష్టం చేసింది అయితే ముందెన్నడు లేని రీతిలో తెలుగు ఫిల్మ్ చాంబర్ సినీ అవార్డులను ఇస్తామని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ప్రభుత్వం తరుపున సినిమా వాళ్లకు నంది అవార్డులు ఇచ్చేవారని... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవ్వడం లేదని..అందుకే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఫిల్మ్ చాంబర్ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. తెలుగులో మొట్ట మొదట రిలీజైన మూవీ 'భక్త ప్రహ్లాద'. 1932 ఫిబ్రవరి 6న ఆ మూవీ విడుదల కావడంతో ఆ రోజు నుంచి తెలుగు సినిమా పుట్టినరోజుగా టాలీవుడ్ జరుపుకుంటుంది. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన టెక్నిషియన్స్ అందరూ ఈ వేడుకలలో పాల్గొంటారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) ఓ వైపు నంది అవార్డుల స్థానంలో ప్రతి ఉగాది(Ugadi)కి "గద్దర్ అవార్డ్స్(Gaddar Awards)ఇస్తామని నిర్ణయించగా..అవార్డుల రూపకల్పన, విధి విధానాలకు కమిటీ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులు అందజేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఫిచర్ ఫిల్మ్ లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాలపై పుస్తకాలు వంటి విభాగాల కింద కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఓ వైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గద్దర్ అవార్డు ప్రధానోత్సవంపై కసరత్తు చేస్తుంటే..ఇదే సమయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా అవార్డుల ప్రధానోత్సవం ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకాలం సొంతంగా ఎలాంటి అవార్డులు ఇవ్వని ఫిల్మ్ చాంబర్ ఇప్పుడు గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సన్నాహాల వేళ తాము స్వయంగా అవార్డులు ఇస్తామనడం వెనుక మతలబు ఏమిటన్నదానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

ఇటీవల గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందిస్తూ హింసాత్మక భావజాలాన్ని ప్రేరేపించిన నేపథ్యం ఉన్న గద్దర్ కు పద్మశ్రీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మా సిద్ధాంతాలను విశ్వసించే సినీ నటులు గద్దర్ అవార్డులను బహిష్కరిస్తారని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ అవార్డుల ప్రధానోత్సవం ప్రకటన పై పలు కోణాల్లో విశ్లేషణలు..ఊహాగానాలు సాగుతున్నాయి.

కాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ అవార్డుల నిర్ణయంపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పేరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎండీ హరీశ్, గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ బి.నర్సింగ్ రావు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే తెలుగు ఫిల్మ్ చాంబర్ అవార్డుల ప్రకటన వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

Next Story