Boycott: రేపటి నుంచి పరీక్షలు బహిష్కరిస్తున్నాం.. ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య మరో కీలక నిర్ణయం

by Ramesh Naini |

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే.

Boycott: రేపటి నుంచి పరీక్షలు బహిష్కరిస్తున్నాం.. ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య మరో కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇవాళ్టి (నవంబర్ 3) నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు (Private Educational Institutions) నిరవధిక బంద్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee reimbursement) బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా , డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. తాజాగా సమాఖ్య మరో నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఈ నెల 8న హైదరాబాద్‌లో కాలేజీల సిబ్బందితో సమావేశం అవుతున్నట్లు తెలిపింది.

ఈ నెల 11 వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మా డిమాండ్స్‌ను నెరవేర్చేవరకు బంద్‌ జరుగుతుందని ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు తెలిపారు. బాకాయిల్లో 50 శాతం ఇస్తేనే బంద్ విరమిస్తామని, రూ.5 వేల కోట్లు ఇచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వానికి మొత్తం రూ. 9 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. గతంలో జరిగిన చర్చల్లో దీపావళిలోగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతా రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం సానుకూల స్పందన లేకపోవడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల సమాఖ్య సమ్మె నోటీసు ఇచ్చింది.

Next Story