కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో గళం విప్పిన మరో మాజీ IAS !

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో గళం విప్పిన మరో మాజీ IAS !
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మాజీ బ్యూరోక్రాట్ల నుంచి గట్టి ఎదురుగాలి వీస్తోంది. ఇన్నాళ్లు కేసీఆర్ పరిపాలనలో పని చేసిన అధికారులు ఒక్కొక్కరుగా సీఎం పరిపాలనపై ఆయన వైఖరిపై నిరసన గళం విప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. దీంతో బీఆర్ఎస్ విషయంలో ఓ వైపు ప్రస్తుత అధికారులు ప్రశంసలతో ముంచెత్తుతుంటే మరోవైపు మాజీ అధికారులు ఒక్కొక్కరుగా పెదవి విరవడం హాట్ టాపిక్ అవుతోంది. పదవుల కోసం కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి కాళ్లపై పడుతుంటే మరో వైపు మాజీలు తీవ్రస్థాయిలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐఏఎస్ పోస్టింగులు ఇవ్వడంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల మేరకు పనిచేసే వారికంటే దాసోం అన్నవారినే ప్రభుత్వం అందలం ఎక్కిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన వారు ఒక్కొక్కరుగా తమ నిరసన గళానికి పదును పెడుతున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం అధికార పార్టీకి సవాలుగా మారింది. ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారని నిరసన వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి రాజకీయంగా యాక్టీవ్‌గా మారారు. కేసీఆర్ సర్కార్ విధానాలపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. ఆయన బాటలోనే ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌పై రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. బీఎస్పీ అధ్యక్షుడి హోదాలో ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడు. ఈ క్రమంలో మరో ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ ఐఏఎస్ చంద్రవదన్ కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. మాజీ ఐపీఎస్ వీకే సింగ్ కూడా కేసీఆర్ పరిపాలనపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వీరంతా బీఆర్ఎస్ పాలనలోని విధానాలను వ్యతిరేకిస్తున్న ఐఏఎస్, ఏపీఎస్‌లే. ఇదిలా ఉండగా.. వీరి బాటలోనే మరో మాజీ ఐఏఎస్ బీఆర్ఎస్‌పై ఇటీవల తన నిరసన స్వరం వినిపిస్తుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతోంది.

స్వరం పెంచిన మాజీ కలెక్టర్:

పై అధికారుల బాటలోనే మాజీ కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి సామాజిక, రాజకీయ అంశాలపై తన గొంతు విప్పుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ట్వీట్ చేసిన ఆయన 'రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ, బహుజన బిడ్డలు ఉద్యోగ, ఉపాధి కోసం ఏళ్ల తరపడి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని అయితే రాబోయే ఎలక్షన్ల ముందు ఇస్తున్న కొన్న వందల ప్రభుత్వ ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయని' ప్రశ్నించారు. 'ప్రైవేట్ ఉద్యోగాల కల్పన స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి పథకాలు ఏవి లేవని కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామా ఏమైందని' నిలదీశారు. ఇటీవ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన సందర్భంగా ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేసి తీరుతామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రెడ్డి సెటైర్లు వేశారు. 'ఎర్ర కోటపై మన ఎప్పుడూ ఎగరవేసేది జాతీయ జెండానే తప్ప రాజకీయ జెండాలు కాదని.. రాజకీయ జెండాలు ఎగరవేయడానికి మన రాజ్యాంగాన్ని ఏమైనా సవరించారా? లేక మార్చారా?' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తాజాగా మరో ట్వీట్ చేసిన ఆయన '50 ఏళ్ల క్రితం తన చిన్ననాటి నుండే తన గ్రామంలో ఆట పాటలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండగ జరిగేదని కానీ ఇప్పుడు డీజేలు, డిస్కోలు, ఫోజులు, ఫోటోలు, ప్రచార ఆర్భాటాలు ఉంటున్నాయని' ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు ఇది ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ అంటున్నారు. గతంలో బతుకమ్మ ఆడేందుకు సిగ్గుపడేవారని తాము జాగృతి ఏర్పాటు చేశాక బతుకమ్మకు పేరు వచ్చిందని కవిత చేసిన వ్యాఖ్యలకు ఎంవీ రెడ్డి ఈ తీరుతో ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా 'అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బహుజన రాజ్యం స్థాపన కోసం, సామాజిక తెలంగాణ కోసం మరోక యుద్ధం జరగాలని ఇందుకోసం బహుజనులంతా ఏకమై ఉద్యమించాలని' ట్వీట్ చేశారు. 'స్కీములు, భవనాలకు అంబేద్కర్ లాంటి మహానీయుల పేర్లు పెట్టి.. మరో వైపు రాజ్యాంగానికి తూట్లు పొడిచి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, మీ వ్యాపారాలు, కుటుంబ ఆస్తులు పెంచుకునే స్వార్థ రాజకీయాలను ఆపండి. పోయే ముందు పేద బహుజనులను ఆదుకునే ప్రయత్నం చెయ్యండి లేకుంటే మీకు ఆపాపం తప్పదు'. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై ఈ కామెంట్ చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికపై స్పందిస్తూ 'రుచి మరిగిన ఆవకాశ వాద, వ్యాపార, ఉన్నత కుటుంబాలు, వారి సార్థంకోసం సామాన్యుల జీవితాలను గాలికి వదిలి, మన రాష్ట్రాన్ని చెర బట్టాయని, మునుగోడు ఉప ఎన్నికతో పూర్తిగా అర్థమైనది. ఆరుగాలం కష్టంతో, జీవన పోరాటం చేస్తూ దమ్ము, ధైర్యం, కసి ఉన్న మనం వీళ్ల దుర్మార్గమైన ఆటకు ముగింపు పెట్టలేమా? అని ప్రశ్నించారు. ఇలా వరుసగా సామాజిక మాధ్యమం ద్వారా తన గళం విప్పుతున్న ఎంవీ రెడ్డి విషయం ఇటీవల చర్చగా మారుతోంది.

త్వరలో రాజకీయాల్లోకి ఎంవీ రెడ్డి?:

ప్రతి రోజు ట్విట్టర్ వేదికగా స్వరం పెంచుతున్న ఎంవీరెడ్డి తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారా? అందుకోసమే ప్రభుత్వంపై ఇన్ డైరెక్ట్ గా విమర్శల దాడి పెంచుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది. అదే గనుక జరిగితే కేసీఆర్ విధానాలపై పోరాడుతున్న మాజీ బ్యూరోక్రాట్ల జాబితాలో ఆయన చేరినట్టే అవుతుంది. అయితే గతంలో ఎంవీ రెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఎంవీ రెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో ప్రారంభించారు. అలాంటి ఎంవీ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ పరిపాలనపై ఇన్ డైరెక్ట్ గా విమర్శలు గుప్పించడం సర్వత్రా హాట్ టాపిక్ అవుతోంది.

Next Story