భూభారతి వచ్చినా.. భూ సమస్యలు అపరిష్కృతమే!

by Malleboina Mahesh |   (  Updated:2025-11-16 02:20:58  IST  )

రాష్ట్రంలో 3 నెలలుగా భూ సమస్యల పరిష్కారం అటకెక్కింది. రెవెన్యూ సదస్సుల్లో తీసుకున్న అప్లికేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది.

భూభారతి వచ్చినా.. భూ సమస్యలు అపరిష్కృతమే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 3 నెలలుగా భూ సమస్యల పరిష్కారం అటకెక్కింది. రెవెన్యూ సదస్సుల్లో తీసుకున్న అప్లికేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నామని ఉన్నతాధికారులు చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గతంలో రిజెక్ట్ చేసిన దరఖాస్తులంటూ తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు పేచీ పెడుతున్నారు. మరోసారి రికార్డులను వెరిఫై చేసి పరిష్కరించాల్సి ఉండగా.. క్షణాల్లో రిజెక్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ధరణిని బూచీ గా చూపిస్తూ సమస్యలు పరిష్కరించని అధికారులు.. భూ భారతి వచ్చాక దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. పరిష్కార మార్గాలున్నా.. పట్టించుకోవడం లేదు. దీంతో భూభారతి వచ్చినా తమకు న్యాయం జరగడం లేదంటూ సోషల్ మీడియాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రభుత్వం బద్నాం అవుతున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా పరిష్కారం కాని నారాయణపురం రైతుల ఇష్యూ..

సర్పంచ్ నుంచి సీఎం వరకు గుర్తించిన, అసెంబ్లీలో చర్చకు వచ్చిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతుల ఇష్యూ.. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ధరణి పోర్టల్ తప్పిదంగా ప్రస్తావించిన ఈ సమస్య.. భూభారతి వచ్చినా సాల్వ్ కాలేదు. అసెంబ్లీలో మంత్రి చెప్పినా.. సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తాము ఎనిమిదేండ్లుగా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, పంట రుణాలకు దూరమయ్యామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టా భూములను 2017 లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో అటవీ భూములుగా పేర్కొని పట్టాలను రద్దు చేశారు. 2021లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి 1,633 ఎకరాలను సాగుభూమిగా తేల్చారు.

633 ఎకరాలకు పాసు పుస్తకాలు ఇచ్చారు. రైతు పేరు ‘అడవి’, తండ్రి పేరు 'అడవి' అని నమోదై ఉన్న దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలగించారు. భూ భారతి చట్టం అమలు సందర్భంగా అసెంబ్లీలోనూ మంత్రి నారాయణ పురం గ్రామ సమస్యను ప్రస్తావించారు. ఈ మేరకు 6 నెలల క్రితం రెవెన్యూ, సర్వే అధికారులు బృందాలుగా గ్రామంలో తిరిగి క్షేత్ర స్థాయిలో ప్రతి రైతు వివరాలను నమోదు చేశారు. మిగిలిన వెయ్యి ఎకరాల్లో 600 మంది రైతుల భూములను ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి 6 నెలలు గడుస్తున్నా.. సీసీఎల్ఏ, కలెక్టర్ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేసిన తప్పిదాన్నీ సవరించని అధికారులు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం లో సర్వే నం.423, 424 లో కాంతి రెడ్డి అనే వ్యక్తి నుంచి వంగూరు నాగన్న భూమిని కొనుగోలు చేశారు. 1979-80 పహాని ప్రకారం కాంతారెడ్డికి సర్వే నం.423లో 1.27 ఎకరాలు, 424 లో 2.26 ఎకరాలు ఉన్నది. 1989-90 పహానీ ప్రకారం సర్వే నం.423లో 0.33 ఎకరాలు, 424లో 1.13 ఎకరాలుగా ఉన్నది. తర్వాత సర్వే నం.423లో 0.33 ఎకరాలు, 424లో 1.13 ఎకరాలను ఆర్వోఆర్‌లో సవరణ చేసి వంగూరు నాగన్న, తండ్రి నట్టయ్యగా నమోదు చేశారు. ఈ మార్పునకు ఆధారంగా రిజిస్టర్ డాక్యుమెంట్ 1191/1987 (తేదీ.26.5.1987) చూపారు. అయితే ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ మార్పును 1995-96 నుంచి చేశారు. ఇది రెండు సార్లు వంగూరు నాగన్న పేరిట మారింది. నాగన్న తండ్రి నట్టలయ్య మరణించిన తర్వాత ఆ భూమిని వారసులైన భార్య నాగమ్మ పేరిట మార్చుకున్నారు. అందులోని కొంత భాగాన్ని సర్వే నం.423లో 0.27 ఎకరాలు, 424లో 1.13 ఎకరాలను 2021 ఏప్రిల్ లో రెండు సేల్ డీడ్స్ ద్వారా అమ్మేశారు.

పట్టాదారుడికి మిగిలిన భూమిలో సర్వే నం.423లో 0.33 ఎకరాలు, 424లోని 1.13 ఎకరాలు కాంతారెడ్డికి సంబంధించినదిగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దర్యాప్తులో తేలింది. అంటే నాగన్న కొనుగోలు చేసిన భూమి రెండు సార్లు నమోదు చేయడం వల్ల కాంతారెడ్డి నష్టపోయారు. ఆర్వోఆర్ చట్టం-2020 ప్రకారం రెవెన్యూ కోర్టు రద్దయ్యింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుపడదు. అందుకే సివిల్ కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారుడికి తహశీల్దార్ లిఖితపూర్వకంగా సలహా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు లిఖితపూర్వకంగా అంగీకరిస్తున్నప్పుడు తామెందుకు కోర్టుకు వెళ్లాలని బాధితులు ప్రశ్నించారు. భూ భారతి వచ్చిన తర్వాత అప్లై చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరి చేసే అధికారం కలెక్టర్‌కు ఉన్నప్పటికీ.. తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు.

క్లాసిఫికేషన్ చేంజ్.. అధికారుల ఇష్టం

ధరణి పోర్టల్ వచ్చాక లక్షలాది ఎకరాల పట్టా భూములను ప్రభుత్వానిదిగా మార్చేశారు. 1955 నుంచి పట్టాగా ఉన్న భూమి, పలుమార్లు చేతులు మారినా, సేత్వార్, ఖాస్రా పహానీ ప్రకారం అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేసి చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యరడవల్లిలో పట్టా భూములను ఖారిజ్ ఖాతా పేరిట పీవోబీలో పెట్టారు. హక్కుదారులు మూడు సార్లు అప్లయ్ చేస్తే రిజెక్ట్ చేశారు. ఇప్పుడేమో రెవెన్యూ సదస్సులో ‘గతంలో రిజెక్ట్ చేశాం.. ఇప్పుడు తీసుకోం’ అంటున్నారు. 30 ఏండ్లకు పైగా పట్టాగా ఉంటే దాన్ని పట్టాగానే భావించాలని స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం సేత్వార్ ప్రామాణికం అంటూ పేచీ పెడుతున్నారు. ధరణి పోర్టల్‌, భూ భారతిలో డేటాను ఆర్వోఆర్ చట్టం-1971 సెక్షన్ 4(3) ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌ను ప్రిపేర్ చేశారు. దాని ప్రకారమే రికార్డుల నిర్వహణ, తయారీ జరుగుతుందన్నారు. కానీ సేత్వార్, ఖాస్రా పహానీల ప్రకారం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇలాంటి సమస్యకు సీసీఎల్ఏ దరఖాస్తుల తిరస్కరణకు బదులుగా నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

పెండింగ్ ఎందుకు?

తెలంగాణలో భూ భారతి ఆర్వోఆర్ చట్టం-2025 అమల్లోకి వచ్చినా.. లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటూ లెక్క లేనన్ని సార్లు అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు. గట్టిగా అడిగితే.. మమ్మల్నేం చేయమంటారు? సర్వే నంబరులో విస్తీర్ణం పెరిగింది. ఎవరిది తీసేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఖాస్రా పహానీలో ఉండాల్సిన దానికంటే అధికంగా ఉందని, సిస్టం యాక్సెప్ట్ చేయడం లేదంటూ బుకాయిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో 20 నుంచి 30 శాతం సర్వే నంబర్లలో సేత్వార్(ఆర్ఎస్ఆర్) కంటే ప్రస్తుతం ఉన్న రికార్డుల్లోని భూమి ఎక్కువగా ఉంది. లేని భూమికి హక్కులు పొందారు. జస్ట్ ఆర్వోఆర్ రికార్డులను పరిశీలించి అక్రమంగా విస్తీర్ణం కలిగిన వారిని సుమోటోగానే తొలగించే అధికారం తహశీల్దార్లకు ఉంది. కానీ నాన్చుడు ధోరణితో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Next Story