ఎర్రకుంట చెరువు కబ్జా..!

by Muthe.Rajitha |

చెరువును చెరబట్టారు. నీటిలో కళకళలాడి రైతులకు సాగునీరందించిన ఆ చెరువు కబ్జాకు గురైంది.

ఎర్రకుంట చెరువు కబ్జా..!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: చెరువును చెరబట్టారు. నీటిలో కళకళలాడి రైతులకు సాగునీరందించిన ఆ చెరువు కబ్జాకు గురైంది. చెరువు భూమిలో భవంతులు వెలిశాయి. అలాగే చెరువు పక్కనే ఉన్న అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నారు. ఇంత జరుగుతుంటే ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు అాలా చూస్తూ ఉండిపోతున్నారు. స్థానిక రాజకీయ పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే ఈ ఆక్రమణ తతంగం కొనసాగుతున్నది. అక్కడ నిర్మించిన భవనాల్లో ప్రైవేట్ వ్యాపారాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కబ్జా వ్యవహారంలో కోట్లు చేతులు మారినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్ద శంకరంపేట మండల కేంద్రం సమీపంలోని తిరుమలాపూర్ ఎర్రకుంట చెరువు భూమి, ఆ పక్కనే ఉన్న అసైన్జ్ భూముల కబ్జా బాగోతం ఇది.

యథేచ్ఛగా భవనాల నిర్మాణం..

తిరుమలాపూర్ ప్రైవేట్ భవనాలు నిర్మిస్తున్నారు. పశువులు, పక్షులతో కళకళలాడాల్సిన ఆ చెరువు భూమిని కబ్జా చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ముందు తరాలకు చెరువు లేకుండా చేసే ప్రమాదం ఉన్నదని స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్రకుంట చెరువు సర్వే నెంబర్ 258లో 2.7 ఎకరాల భూమిలో మొత్తం 10 భవనాలు నిర్మించారు. ఇందులో వివిధ ప్రైవేట్ సంస్థలు తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నాయి. సర్వే నెంబర్ 1 లో 18 ప్రభుత్వ భూమి 10 ఎకరాలు కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరో 10 ఎకరాల అసైన్డ్ భూమి కూడా..

పెద్దశంకరంపేట పట్టణంలోని సర్వే నెంబర్ 1లో 18 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిలోంచి ప్రభుత్వం మాడల్ స్కూలుకు 5 ఎకరాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయంకు 2 ఎకరాలు , బీసీ హాస్టల్ కు మరో ఎకరం కేటాయించింది. ఆ తరువాత స్థానిక లీడర్ల ప్రమేయంతో మిగిలిన భూమి కబ్జా అవుతూ వస్తున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 58,59 జీవోలో తప్పుడు పత్రాలు సృష్టించి పద్మాలయా ఆసుపత్రిని ఈ భూమి పొందినట్లు చెబుతున్నారు. ఈ భూమి అవతల ఉన్న వెంచర్ కోసం అసైన్డ్ భూమి నుంచి 40 ఫీట్ల రోడ్డుకు కూడా ఇచ్చారని పట్టణానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వెంచర్ కొమ్ముకాసి ఇలా రోడ్డుకు భూమి ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపుగా 10 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు చెబుతున్నారు.

అధికారుల మౌనం ఎందుకు..?

పట్టణంలోనే యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఇలా కబ్జాకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇగిరేషన్, రెవెన్యూ, స్థానిక పంచాయతీ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక లీడర్లతో అధికారులు కుమ్మక్కు అయ్యారని, ఈ క్రమంలోనే భూములు కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అటు చెరువు భూమి, మరో వైపు అసైన్డ్ భూమి కబ్జాల వ్యవహారంలో లక్షల నుంచి కోట్ల వరకు చేతులు మారినట్లు కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కల్పించుకుని భూమిని సర్వే చేసి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తమకు సంబంధం లేదు...

ఈ కబ్జాల వ్యవహారంలో తమకు సంబంధం లేదని ఓ శాఖకు చెందిన అధికారి చెప్పారు. తాము ఇక్కడ లేనప్పుడు ఈ కబ్జాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడడానికి చర్యలు తీసుకుంటామని, అక్కడ ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చెప్పుకురావడం గమనార్హం. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక లీడర్ల అండదండలతో కబ్జాలు జరగడంతోనే అధికారులు మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది.

Next Story