- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా ఇంగ్లీష్ అల్గారిథమ్
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా), తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో చేతులు కలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా), తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో చేతులు కలిపింది. ఈ మేరకు ఇంగ్లీష్ అల్గోరిథం అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేయడానికి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డిని ట్రస్మా ప్రతినిధి బృందం సోమవారం టీజీసీహెచ్ఈ కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా విద్యార్థులలో నైపుణ్యం ఆధారిత అభ్యాసం, ముఖ్యంగా ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యాన్ని మెరుగుపరచడం ద్వారా విద్యావిజయం, ఉపాధి, పోటీ పరీక్షల సంసిద్ధతను సాధించాలనే సీఎం దార్శనికతను అనుగుణంగా ఉన్నత విద్యా మండలి "ఇంగ్లీష్ అల్గోరిథం" అనే వినూత్న పాఠ్య ప్రణాళిక, పద్ధతిని అభివృద్ధి చేసింది.
ఇది విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఉపయోగించి రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ కంటెంట్, ప్రత్యేకించి వినడం, మాట్లాడటం ప్రావీణ్యంపై దృష్టి సారించే నిర్మాణాత్మక అభ్యాసాలు ఉన్నాయి. ఇది తెలంగాణ ఉన్నత విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆసక్తిగల విద్యార్థులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ట్రస్మా ఆసక్తి, టీజీసీహెచ్ఈ మద్దతు:
తమ సభ్య పాఠశాలల్లో విద్యార్థులలో, ముఖ్యంగా ప్రారంభ తరగతుల నుండే, ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని స్వీకరించడానికి ట్రస్మా ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయ శిక్షణ సెషన్లను ఏర్పాటు చేయాలని ట్రస్మా ప్రతిపాదించింది. ట్రస్మా చొరవను ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, ప్రోగ్రామ్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేష్ అభినందించారు. ట్రస్మా సభ్య పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా అంగీకరించారు. ఈ సహకారం వల్ల రాష్ట్రంలోని 34 లక్షల మంది ప్రైవేట్ విద్యార్థులందరికి ఉచితంగా ఇంగ్లీష్ అల్గోరిథం వేదిక అందుబాటులోకి వస్తుందన్నారు.
ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ర్టంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన, నైపుణ్యం ఆధారిత విద్యను అందించాలనే ట్రస్మా లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల, ఉన్నత విద్యా ప్రమాణాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందన్నారు. విద్యార్థులకు అవసరమైన 21వ శతాబ్దపు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అందిస్తుందన్నారు. ట్రస్మా ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్, జనరల్ సెక్రటరీ ఎన్. రమేష్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ట్రస్మా ఎన్నికల కమిషన్ సభ్యుడు పోలపల్లి సుందర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడుఎస్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.






