బదిలీ విధానంపై ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వినతి

by Ramesh Naini |

టీజీఎస్పీడీసీఎల్‌తో పాటు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల పరిధిలో బదిలీలకు సంబంధించి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేసి, ఉద్యోగ సంఘాలు- యూనియన్లతో చర్చించిన అనంతరమే బదిలీ మార్గదర్శకాలను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది.

బదిలీ విధానంపై ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్పీడీసీఎల్‌తో పాటు రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల పరిధిలో బదిలీలకు సంబంధించి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను నిలిపివేసి, ఉద్యోగ సంఘాలు- యూనియన్లతో చర్చించిన అనంతరమే బదిలీ మార్గదర్శకాలను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీపీఈజేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జేఏసీ వినతి పత్రాన్ని సమర్పించింది. 2026 మే-జూన్ నెలల్లో సాధారణ బదిలీలు చేపట్టాలని గతంలోనే సూచించినట్లు టీజీపీఈజేఏసీ పేర్కొంది. విద్యుత్ ఉద్యోగుల పిల్లలకు వార్షిక పరీక్షలు ఉండటంతో పాటు, వేసవి కాలంలో నిరవధిక విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు రూపొందించే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కాలాన్ని ప్రతిపాదించినట్లు వివరించింది. అయితే, ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో ఎలాంటి చర్చలు జరపకుండానే జనవరి 2026లోనే సాధారణ బదిలీలు చేపట్టేందుకు డిస్కమ్ యాజమాన్యాలు ముందుకు రావడం పట్ల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమలులోకి తీసుకొస్తున్న బదిలీ విధానంలో, రెండేళ్ల సేవ పూర్తి చేసిన ఉద్యోగులందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిబంధనను చేర్చడం సమంజసం కాదని పేర్కొంది.

ప్రస్తుత పోస్టులో మూడు సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీలు వర్తింపజేయాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని జేఏసీ సూచించింది. అదే సమయంలో టీజీఎస్పీడీసీఎల్‌లో ఓఅండ్‌ఎం విభాగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఇన్‌చార్జ్ ప్రమోషన్లు జారీ చేయాలని, డిస్కంల పరిధిలోని ఆర్టిజన్లకు గ్రేడ్ అప్‌గ్రేడేషన్ కల్పించాలని వినతిపెట్టాయి. అదే విధంగా టీజెన్‌కో, టీజీట్రాన్స్‌కో యాజమాన్యాలు కూడా ఇంజినీర్లు, ఉద్యోగులకు ఇన్‌చార్జ్ ప్రమోషన్లు జారీ చేయాలని కోరాయి. యూనియన్లతో చర్చలు జరపకుండా బదిలీ మార్గదర్శకాలను ఏకపక్షంగా జారీ చేయడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని జేఏసీ పేర్కొంది. నిరవధిక విద్యుత్ సరఫరా కొనసాగాలంటే ఉద్యోగుల్లో స్థిరత్వం, విశ్వాసం అవసరమని, అందుకు చర్చల ద్వారానే విధాన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జేఏసీ కోరింది. ఈ నేపథ్యంలో బదిలీ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో ఈనెల 24 సాయంత్రం వరకు చర్చలు నిర్వహించి, అవసరమైన మార్పులు చేసిన అనంతరమే సాధారణ బదిలీలు అమలు చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. యాజమాన్యాలు స్పందించకుంటే జేఏసీ తరఫున తదుపరి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేసింది.

Next Story