రైతులను కాల్చి చంపిన చరిత్ర వైఎస్ఆర్‌ది: కాంగ్రెస్ నేతలపై బాలరాజుయాదవ్ ఫైర్

by Disha Web Desk 19 |
రైతులను కాల్చి చంపిన చరిత్ర వైఎస్ఆర్‌ది: కాంగ్రెస్ నేతలపై బాలరాజుయాదవ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సెల్ఫీ విత్ కాంగ్రెస్ కాదు.. సెల్పీ విత్ తెలంగాణ ద్రోహులు’ అని పెట్టుకోండి అని షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కి చర్యతో కాంగ్రెస్‌లో బానిస రాజకీయ తత్వం బయటపడిందని ఆరోపించారు. మంగళవారం షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

2007లో ముదిగొండ కాల్పులు జరిపి 7 మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర మాజీ సీఎం వైఎస్ఆర్‌దని మండిపడ్డారు. వైఎస్ఆర్ ఫొటోతో సెల్పీ విత్ కాంగ్రెస్ అంటే వంద ఎలుకలను తిన్న పిల్లి సంతాప సభ పెట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చేసిన అన్యాయాలను కాంగ్రెస్ గుర్తుచేస్తుందా? ఆర్డీఎస్ తూములను పగలకొట్టిన చరిత్రను గుర్తు చేస్తుందా? తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయటం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్రను గుర్తుచేస్తుందా? అని ప్రశ్నించారు.

వ్యవసాయరంగానికి 3 గంటల ఉచిత విద్యుత్ చాలన్న రేవంత్ మాటలు రైతుల మనోభావాలను దెబ్బతీయగా.. వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం కాంగ్రెస్ నేతలు కొత్త డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత కాళ్ల మీది తెలంగాణ నాయకత్వం కావాలా..? ఢిల్లీకి బానిసత్వం చేసే నాయకత్వం కావాలా..? వైఎస్ఆర్ ఫొటో కార్యక్రమంతో తెలంగాణ నాయకత్వం ఆలోచన ఏమిటో బయటపడిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ నేతలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

Advertisement
Next Story

Most Viewed