DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది: డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది: డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మధ్య లోకానికి తెలియని లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్స యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్ధపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. ప్రజలను మోసం చేస్తూ రేవంత్ సర్కార్ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలను ఆమలు చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అక్కర్లేని కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.లక్షల కోట్లు కుమ్మరించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్ అసలు పనికిరాదంటూ కేంద్రం నుంచి వచ్చిన డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు చెబుతున్నారని, ఆ విషయంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా.. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు పాల్పడిన అవినీతిపై ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించట్లేదని ప్రశ్నించారు. ఇక్కడే కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌కు మధ్య ఉన్న దోస్తీ బయటపడుతోందని దుయ్యబట్టారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed