అధికార పార్టీకి ‘డబుల్’ ఇండ్ల టెన్షన్.. పంపిణీ చేస్తే ‘రిస్క్’ తప్పదా?

by Disha Web Desk 2 |
అధికార పార్టీకి ‘డబుల్’ ఇండ్ల టెన్షన్.. పంపిణీ చేస్తే ‘రిస్క్’ తప్పదా?
X

అధికార పార్టీకి ‘డబుల్’ ఇండ్ల టెన్షన్ పట్టుకున్నది. ఇప్పుడు పంపిణీ చేస్తే ‘రిస్క్’ అని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలిసింది. ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే చాలా చోట్ల వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముండడంతో పంపిణీకి వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, గృహలక్ష్మి స్కీమ్ ప్రారంభించాక, డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని సూచించినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం ఎమ్మెల్యేల అనుచరులకు కేటాయిస్తున్నారని, మరి కొన్ని చోట్లు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పెద్ద సమస్యగా మారింది. కట్టిన ఇండ్లను ఎలా పంపిణీ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఇండ్లు వేలల్లో ఉంటే, అప్లికేషన్లు లక్షల్లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. కొందరికి ఇండ్లను ఇస్తే, మిగతా వారి నుంచి విమర్శలు వస్తున్నాయి. అందుకని చాలా నియోజకవర్గాల్లో ఇండ్లను పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గృహలక్ష్మి స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఇండ్ల పంపిణీ పక్రియ ప్రారంభించాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.

తొమ్మిదేండ్లుగా ఎదురుచూపులే

రాష్ట్రం వచ్చినప్పటి నుంచి డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ అంతులేని కథగా మారింది. అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేశారే తప్పా ఇంతవరకు ఇండ్లను మాత్రం పంపిణీ చేయలేదు. దీంతో కొన్ని చోట్ల నిర్మించిన ఇండ్లు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల కిటికీలు, తలుపులు ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. చాలా చోట్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్టు విమర్శలు వస్తున్నాయి. పూర్తయిన ఇండ్లను రిపేర్ చేసి పంపిణీ చేసేందుకు లోకల్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల ఇండ్లను పూర్తిచేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు 35 లక్షలు ఉన్నట్టు అంచనా. దీంతో పంపిణీ పెద్ద సవాలుగా మారింది.

నిలదీస్తున్న ప్రజలు

డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ అమలుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. కొన్ని చోట్ల ఇండ్లు పంపిణీ చేయడం లేదని ఆవేదనతో ప్రజలే తాళాలను పగులగొట్టి ఇండ్లలోకి వెళ్తున్నారు. దీంతో పోలీసులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర కాపలా కాసే పరిస్థితులు నెలకొన్నాయి.

అనుచరులకు కేటాయింపులు

కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఇండ్లను పంపిణీ చేశారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఆందోళనలు జరగడంతో నిలిపివేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహించి, డ్రా తీస్తున్నారు. కానీ కొన్ని చోట్ల డ్రాలో వచ్చిన వ్యక్తులకు కాకుండా స్థానిక ఎమ్మెల్యేలు తమ అనుచరులు, బంధువులు, కార్యకర్తలకు కేటాయిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అసలైన లబ్ధిదారులు ఆందోళనలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇండ్లను కేటాయించినందుకు లబ్ధిదారుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఇండ్లు ఇచ్చేదిలేదని ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.

గృహలక్ష్మి స్కీమ్ ఎప్పుడు?

2018 అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా సొంత జాగా ఉన్న నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల సాయం చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ మధ్య ఆ స్కీమ్ కింద సాయం చేసే మొత్తాన్ని రూ.3 లక్షలకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. కానీ ఇంతవరకు ఆ స్కీమ్ లో లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? ఎవరు అర్హులు? ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు? అనే అంశాలపై గైడ్ లైన్స్ తయారు చేయలేదు. ఆ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ స్టార్ట్ చేస్తే, ప్రజల నుంచి కొంత ఒత్తిడి తగ్గుతుందని సీఎం కేసీఆర్ సూచించినట్టు అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఆ స్కీమ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. ఇంతవరకు రూల్స్ తయారు కాలేదని వాపోతున్నారు.

Next Story

Most Viewed