అజారుద్దీన్ మంత్రి పదవికి దగ్గర పడుతున్న గడవు.. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?

by Prasad Jukanti |

తెలంగాణ మంత్రి అజారుద్దీన్ పదవికి గడువు సమీపిస్తోంది. ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సిన తరుణంలో రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? అనేది చర్చగా మారింది.

అజారుద్దీన్  మంత్రి పదవికి దగ్గర పడుతున్న గడవు.. ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) అంశం ఉత్కంఠ రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అనూహ్యంగా మంత్రివర్గంలో బెర్త్ కొట్టేసిన ఈ టీమిండియా మాజీ కెప్టెన్‍కు ఇప్పుడు మంత్రిగా తన ఫ్యూచర్ ఏంటో అనే టెన్షన్ పట్టుకుందట. అసెంబ్లీలో సభ్యత్వం లేని అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండగా ఆ గడువు ఏప్రిల్ ఆఖరుతో ముగియబోతోంది. దీంతో అజారుద్దీన్ ఫ్యూచర్ ఏంటి? ఇంతకు ఆయన మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? మైనార్టీ కోటాలో ఉన్న ఏకైక మంత్రి కావడంతో అజారుద్దీన్ ను కంటిన్యూ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లతో ఉందనేది ఆసక్తిగా మారింది.

ఆశలన్నీ గవర్నర్ పైనే?:

సాంకేతికంగా అజారుద్దీన్ కేబినెట్ లో కొనసాగాలంటే మరో నెలలోపు ఏదైనా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే అజారుద్దీన్‍ను మంత్రివర్గంలోకి తీసుకోకమందే పొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రభుత్వం ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసినా కోర్టు కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్టు వారిని పదవీచ్యుతులను చేసింది. తిరిగి నామినేట్ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి కోర్టు కల్పించింది. దాంతో ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను ప్రభుత్వం నామినేట్ చేసినా గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. కానీ ఏప్రిల్ ఆఖరుతో అజారుద్దీన్‍కు ఉన్న గడవు ముగియడంతో అధికార పార్టీ ఆశలన్నీ గవర్నర్ నిర్ణయంపైనే ఉన్నట్లు తెలుస్తోంది. కవిత రాజీనామాతో ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నప్పటికీ అది స్థానిక సంస్థల ఎన్నికల కోటా కావడంతో పరిషత్ ఎన్నికల తర్వాతే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దాంతో గడువులోపు కవిత స్థానంలో తాను పదవి ఎక్కేందుకు అజారుద్దీన్‍కు దాదాపు అసాధ్యమనే చర్చ జరుగుతోంది.

ఇద్దరిలో మిగిలింది ఒక్కరేనా?:

అజారుద్దీన్ ను చట్టసభలకు పంపించే విషయంలో మరో ఆప్షన్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న బల్మూరి వెంకట్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి ఆ స్థానానికి అజారుద్దీన్‍ను పంపించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా బల్మూరి వెంకట్‍కు, ప్రభుత్వం మండలిలో విప్ గా అవకాశం కల్పించింది. దీంతో బల్మూరి రాజీనామా అంశాన్ని అధికార పార్టీ పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది. ఇక మహేశ్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తున్నా పీసీసీ చీఫ్‍గా ఉన్నందునా అతడి చేత రాజీనామా చేయిస్తారా అనేది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతుందా లేక సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏదైనా వ్యూహంతో ఉన్నారా అనేది ఇటు కాంగ్రెస్ అటు ప్రతిపక్షాల్లో చర్చ జరుగుతోంది.

Next Story