టీ బీజేపీలో అసమ్మతి.. మండలి పోరులో పార్టీకి వ్యతిరేకంగా లీడర్ల క్యాంపెయిన్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.

టీ బీజేపీలో అసమ్మతి.. మండలి పోరులో పార్టీకి వ్యతిరేకంగా లీడర్ల క్యాంపెయిన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 3 శాసనమండలి స్థానాలకు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు సామ దాన భేద దండోపాయాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఒక పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతుండగా, బీజేపీ మూడు చోట్లా క్యాండిడేట్స్‌ను నిలిపి వ్యుహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్ ఒక చోట పోటీ పడుతుండగా, ప్రతిపక్ష బీఆర్​ఎస్​‌ పోటీలో నిలబడలేదు. కమలనాథులు 3 సీట్లు గెలుచుకుని మండలిలో తమ సంఖ్యా బలం పెంచుకునేందుకు.. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల నోటిఫికేషన్‌ ​వచ్చేనాటికి బరిలో నిలిచి లీడర్లందరూ ఒక విడత ప్రచారం ముగించారు.

పార్టీ రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతల గుర్రు

ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం గెలుపును సీరియస్‌​గా తీసుకున్నది. కేంద్ర మంత్రులు కిషన్​‌రెడ్డి, బండి సంజయ్​, ఎంపీలు ఈటల రాజేందర్​, లక్ష్మణ్​, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్​‌రెడ్డి ప్రచార రథాలపై పరుగులు పెడుతూ.. అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసేందుకు చెమటోడ్చుతున్నారు. కానీ, కొందరు నేతలు మాత్రం రాష్ట్ర నాయకత్వంపై కోపంతో మండలి బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రచారం చేయకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుల పదవులు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడంతో అసంతృప్తి నేతలు ఏ విధంగా మండలి ఎన్నికల్లో విజయం సాధిస్తారని మండిపడుతూ.. ఇతర పార్టీలకు చెందిన క్యాండిడేట్లకు మద్దతు పలుకుతున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో వారితో పార్టీ పెద్దలు మాట్లాడి పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ముందుగా వార్నింగ్ ​ఇచ్చి.. అయినా వారి పోకడలు మారకపోతే పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమైనట్టు టాక్‌ వినిపిస్తోంది.

రెండో దఫా పదవి రాని వారంతా వ్యతిరేకమే

పార్టీ ఇటీవలే మూడు దఫాలుగా 28 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసి ప్రకటన విడుదల చేసింది. అందులో సగం మంది వరకు పాత ముఖాలే ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన వారు ఏనాడు పార్టీ కోసం పనిచేసిన వారు కాదని, ఇతర పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారని, వారికే పదవి కట్టబెట్టడంపై జిల్లాలకు చెందిన కొందరు సీనియర్లు హైకమాండ్​‌పై గుర్రుగా ఉన్నారు. తాము సూచించిన మూడు పేర్లు కాదని ఇతరులకు ఇవ్వడమేమిటని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన వారికి సెకండ్‌ ​టర్మ్ ​ఇవ్వకపోవడంతో వారంతా తమ సత్తా ఏమిటో చూపిస్తామని, పార్టీ పెద్దలపై విరుచుకుపడుతూ.. మండలి పోరులో అభ్యర్థులు ఏ విధంగా గెలుస్తారో తాము చూస్తామని అనుచరులు వద్ద పదే పదే ప్రస్తావిస్తున్నారు.

పార్టీ జిల్లా ఆఫీసులకు పిలిచి వార్నింగ్

ఇప్పటివరకు బరిలో నిలిచిన క్యాండిడేట్లకు వచ్చిన కంప్లయింట్స్‌తో కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్లు.. వారిని జిల్లా ఆఫీసులకు పిలిచి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని నచ్చజేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం చేయకున్నా పర్వాలేదు కానీ, వ్యతిరేకంగా చేయొద్దని, పార్టీపై, సీనియర్ లీడర్లను చులకన చేసి మాట్లాడొద్దని సూచించేందుకు సిద్ధమైతున్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే సస్పెండ్​‌ చేసేందుకు వెనకాడే ప్రసక్తి లేదని పార్టీ పెద్దలు వెల్లడించారు.

అందరి ఆమోదం పొందిన వారికి పదవులు ఇవ్వాలి

స్థానిక లీడర్లు ఒప్పుకోని జిల్లా అధ్యక్షులను ఇప్పటికైనా మార్చి వారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించి.. పార్టీకి నిజమైన సేవలందించే వారికి ఇవ్వాలని అసంతృప్తి నేతలు హైకమాండ్​‌ను కోరుతున్నారు. కార్యకర్తలను కలుపుకోలేని, ప్రజల్లో మంచి పేరు లేని వారిని పక్కనపెడితే.. తాము పార్టీ విజయానికి ఎంత కష్టమైన శ్రమించి విజయతీరాలకు చేర్చుతామని పేర్కొంటున్నారు. పార్టీ పెద్దలు ఒంటెద్దు పోకడలు పోతే జరిగే నష్టానికి వారే బాధ్యత వహించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Next Story