- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
N. Shankar: బీసీ ఉద్యమం తప్పదు.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆ తప్పు చేయొద్దు.. డైరెక్టర్ ఎన్.శంకర్ సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించాలని భావిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ పద్ధతిలో హక్కుగా కల్పించాలి తప్ప తాత్కాలిక ఉపశమనంతో కాదని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ (Film Director N Shankar) అన్నారు. తాత్కాలిక పద్దతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఉద్యమాలు, సమాజంలో అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయన్నారు. తాజాగా ఆయన దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో (Disha Interview) మాట్లాడుతూ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని మారెడ్డి డిక్లరేషన్‍లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికను హడావుడిగా నిర్వహిస్తోందని విమర్శించారు. కులగణన చేసినప్పటికీ ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని, తమిళనాడు తరహాలో రాజ్యాంగపరంగా 9వ షెడ్యూల్ లో పెట్టించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పటడుగు వేసిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రక్రియలో లోపాలు ఉన్నాయని అనేక మంది మేధావులు, రాజకీయ పక్షాలు హెచ్చరించినా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని విమర్శించారు.
బీసీ ఉద్యమం రాబోతోంది:
తెలంగాణ తరహాలో రాబోయే రోజుల్లో బీసీల హక్కుల కోసం మరో ఉద్యమం రాబోతోందని అన్నారు. సమజంలోని అణచివేత ఆ సమాజాన్ని పోరాటం వైపు నడిపిస్తూనే ఉంటుందని గతంలో దొరలు, భూస్వాముల అనాగరిక ప్రవర్తన, హింసను తట్టుకోలేక తెలంగాణ సాయుధపోరాటం వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో రాజ్యహింసకు వ్యతిరేకంగా పీపుల్స్ వార్ ఏర్పాటైందన్నారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్దతిలో తెలంగాణ సాధించుకోవాలని పోరాటం పుట్టుకొచ్చిందని నేడు బీసీల్లో చైతన్యంతో బీసీ ఉద్యమం మొదలుకాబోతోందన్నారు. బీసీ ఉద్యమం ఇంకా పురుడుపోసుకునే దశలో ఉందని అందువల్ల బీసీ ఉద్యమంపై అందరికి అనుమానాలు ఉన్నాయన్నారు. బీసీల్లో ఐక్యత లేదనేది కుట్రకోణం అన్నారు. బీసీలను ఐక్యంగా ఉంచకుండా కులాలను విచ్చగొట్టే ప్రయత్నం అన్నారు. బీసీ ఉద్యమానికి నాయకుడు కాదని నాయకత్వం కావాలన్నారు. త్వరలోనే ఆ నాయకత్వం పుట్టి తెలంగాణ ఉద్యమానికి కంటే భిన్నమైన ప్రజాస్వామ్య పద్ధతిలో బీసీ పోరాటం జరగబోతోందన్నారు.
కాంగ్రెస్ నాయకుల మొఖాలు చూసి ఓట్లు వేయలేదు:
రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకు తిరుగుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆయనపై ఉన్న గౌరవాన్ని పోయేలా చేస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది కేవలం ఇక్కడి కాంగ్రెస్ నాయకుల మొఖాలు చూసి కాదని ఆ పార్టీ ఇచ్చిన హామీలు, సోనియా గాంధీ మీద ఉన్న అపారమైన గౌరవంతోనే ఓటు వేశారని చెప్పారు. వారిచ్చిన హామీలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి పొంతన ఉందా అని ప్రశ్నించారు.
ప్రధానిని ఎందుకు కలవడం లేదు?:
బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని అక్కడ ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టరని శంకర్ ప్రశ్నించారు. ఇతర అవసరాల కోసం ప్రధానిని కలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు బీసీ రిజర్వేషన్లపై ఎందుకు కలవడం లేదని నిలదీశారు. అన్ని రాజకీయ పక్షాలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నా ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం లేదని నిలదీశారు. నాడు జయలలిత అఖిలపక్షంతో ఢిల్లీలో కూర్చోలేదా? ఒక రాష్ట్రప్రభుత్వం తాము అఖిలపక్షంతో మోడీని కలుస్తామంటే ప్రధాన మంత్రి అపాయింట్‍మెంట్ ఇవ్వకుండా ఉంటారా అని ప్రశ్నించారు. అఖిలపక్షం విషయంలో అధికారిక లేఖ రాసి పేపర్లో ప్రకటించాక అప్పుడు నిజంగానే మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ఆ తప్పు కేంద్రం వైపు ఉంటుందన్నారు. చిత్తశుద్ధితో మీరు అడిగితే ఎందుకు ఇవ్వరని నిలదీశారు.
బీసీల్లో ముస్లింలు తప్పేముంది:
బీసీ రిజర్వేషన్లలో ముస్లింల అంశం కేవలం సాకు మాత్రమేనన్నారు. గుజరాత్, బిహార్‍లోని ముస్లింలు బీసీల్లోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. ముస్లింలలో కూడా పేదలు ఉన్నారని వాళ్లకు హక్కు కల్పించడంలో తప్పేముందన్నారు. నామినేటెడ్ పదవుల్లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ బీసీలకు పదవులు ఇచ్చి ఇంటే రాష్ట్ర ప్రభుత్వానికి, జాతీయ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము ప్రయత్నం చేసినా బీజేపీ అడ్డుపడుతోందని చెబితే ప్రజలు నమ్మి మిమ్మల్ని అభినందించేవారన్నారు.
ఆత్మహత్యలు వద్దు:
సాయి ఈశ్వర చారి ఆత్మహత్య చాలా బాధాకరం అని చచ్చిపోతే ఏమి రాదని నిలబడి కొట్లాడాలన్నారు. బీసీ హక్కుల కోసం యువకులు, విద్యార్థులు ఉద్యమంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడాలని విజ్ఞప్తి చేశారు. బీసీ భావజాలం వ్యాప్తి గతంలో కంటే ఇప్పుడు చాలా సులభమం అని ఏది న్యాయమో ఏది నిజమే మీడియా చెప్పగలిగితే నేటి యువత కనెక్ట్ అవుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లు, బీసీలకు రాజ్యాధికారం తప్పకుండా సాధ్యం అవుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని 16 (ఎంఐఎం మినహా) ఎంపీలతో ప్రత్యేక రాష్ట్రం ఎలా సాధ్యం అని నాడు మాట్లాడారని కానీ సాధ్యం అయిందన్నారు.
కాంగ్రెస్ అదే నష్టం మళ్లీ చేసుకోవద్దు:
స్వరాష్ట్రం ఏర్పాటులో సోనియాగాంధీ త్యాగం గొప్పదన్నారు. తెలంగాణ ఇస్తే 25 ఎంపీ స్థానాలు ఉన్న ఏపీలో పార్టీ నష్టపోతుందని ఆమెకు తెలిసినా న్యాయమైన డిమాండ్, తను ఇచ్చిన మాటతో పాటు తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని ఇది తెలంగాణ నష్టాన్ని ఎక్కువ నష్టం చేసిందన్నారు. ఈ ఆలస్యానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులేనన్నారు. ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుల్లో సిన్సియర్‍గా పోరాటం చేసింది కేవలం నలుగురు ఐదుగురేనన్నారు. మిగతా వారు అటు ఇటు కాకుండా మొక్కుబడిగా వ్యవహరించారన్నారు. ఇప్పుడు బీసీ ఉద్యమం విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సిన్సియర్‍గా పని చేస్తే ఆత్మహత్యలు, అసమానతలు ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉండదన్నారు. లేదా ప్రజలు అన్ని గమనిస్తారని ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్తారన్నారు. త్వరగా నిర్ణయం తీసుకోకుపోవడం వల్లే రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ నష్టపోయిందని ఇప్పుడు కూడా ఓ వైపు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి మరో వైపు ఒకే వర్గానికి ప్రాధాన్య ఇవ్వడం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 3 ఏళ్ల సమయం ఉందని ఇకనైనా బీసీ రిజర్వేషన్లు ఇస్తే ప్రతి బీసీ తన ఇంట్లో రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారన్నారు. సామాజిక న్యాయం మార్గంలో నడుస్తున్న రాహుల్ గాంధీపై ప్రజల్లో నమ్మకం ఉందని ఇకనైనా శాశ్వత హక్కుగా బీసీలకు న్యాయం చేస్తే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నారు.
నా సినిమాల్లో అదే విషయాన్ని చెప్పాను:
స్థానిక సంస్థల ఎన్నికలను ఇంత హడావుడిగా నిర్వహించడం ఒక కుట్ర, అన్యాయం అనిపించిందని అందువల్లే ప్రతి బీసీ కుటుంబం సర్పంచ్ ఎన్నికల్లో ఒక నామినేషన్ వేయాలని పిలుపునిచ్చానని చెప్పారు. బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతోందనేది ప్రజలు గమనించారని అందువల్ల మీ ఎన్నికలనే నిర్వీర్యం చేస్తే బాగుటుందనే ఆలోచనతో తాను పిలుపు ఇచ్చాననన్నారు. సమయం లేకపోవడం వల్లే తన పిలుపు క్షేత్రస్థాయిలో వెళ్లలేకపోయిందన్నారు. భవిష్యత్‍లో బీసీ ఉద్యమంతో పాటు సినిమాలోనూ ఉంటానని చెప్పారు. బీసీ ఉద్యమంలో తన పాత్ర పాత్ర సినిమాల రూపంలోనే ఉంటుందన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్యా సమానత్వం కావాలన్నారు. ఆర్థిక సమానత్వం వస్తే రాజకీయ సమాన్వతం వస్తుందన్నారు. ఈ రెండు వస్తే విద్యాలో సమానత్వం వస్తుందన్నారు. ఈ అసమానతలను తన దర్శకత్వంలో జయం మనదేరా సినిమాలో ప్రశ్నించామని దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బీసీ ఉద్యమం నేపథ్యంలో సినిమాను చేస్తే చేయవచ్చన్నారు. తన పనే సినిమాలు చేయడం అని తనకు ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే ఆసక్తి ప్రస్తుతం లేదన్నారు. తాను పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని వారి సమస్యలు తెలిసిన వ్యక్తినన్నారు. అవకాశాలు వస్తాయ లేదా అనే లెక్కలు వేసుకోకుండానే తాను ఎన్ కౌంటర్ అనే సినిమాను తన తొలి సినిమాగా తీశానన్నారు. 1996-97 లో ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడటమే నేరం అనే పరిస్థితులు ఉన్న సమయంలో ఎన్‍కౌంటర్ అనే సినిమా తీశానన్నారు. సమాజానికి ఉపయోగపడేవాటిలో తనకు తెలిసిన కళ సినిమా అని దీని ద్వారా తన భావాలు వ్యక్తం చేస్తానన్నారు.






