- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: చివరి గ్రామం వరకూ డిజిటల్ కనెక్టివిటీ
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తక్కువ ఖర్చుతో, నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తక్కువ ఖర్చుతో, నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన 8వ రాష్ట్ర బ్రాడ్‌బ్యాండ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, రాష్ట్రంలో టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌కు అనుగుణంగా చివరి గ్రామం వరకూ డిజిటల్ కనెక్టివిటీ విస్తరించడంపై ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. టెలికాం రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ సంస్థగా మాత్రమే కాకుండా, అవసరమైన సౌకర్యాలు కల్పించే భాగస్వామిగా కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లా స్థాయిలో టెలికాం సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు రెండు వారాల లోపు జిల్లా కలెక్టర్లు డిస్ట్రిక్ట్ లెవల్ టెలికాం కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
‘కాల్ బిఫోర్ యూ డిగ్’
తవ్వక పనుల సమయంలో భూగర్భ టెలికాం కేబుళ్లకు నష్టం కలగకుండా ఉండేందుకు ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ యాప్ వినియోగంపై ఫీల్డ్ అధికారులు అవగాహన పెంచుకోవాలని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల బలోపేతం కోసం చేపట్టిన టీ-ఫైబర్ పైలట్ విలేజ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని చెప్పారు. టెలికాం మౌలిక వసతుల పరంగా తెలంగాణ రాష్ట్రం పలు అంశాల్లో జాతీయ సగటును మించి ముందంజలో ఉందని వెల్లడించారు. టెలికాం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి రైట్ ఆఫ్ వే నిబంధనల అమలు, అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, సంజయ్ కుమార్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






