కవిత ఆరోపణలతో గులాబీ పార్టీలో విభేదాలు.. కేసీఆర్ మౌనంపై అనుమానాలు

by Naga Rani Yarlagadda |

రెండు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఏకంగా కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించే ఆమె కామెంట్స్ చేశారంటూ కేడర్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.

కవిత ఆరోపణలతో గులాబీ పార్టీలో విభేదాలు.. కేసీఆర్ మౌనంపై అనుమానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఏకంగా కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించే ఆమె కామెంట్స్ చేశారంటూ కేడర్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని డ్యామేజీని సైతం తెచ్చిపెట్టాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంటుగానే ఉండిపోయారు. పార్టీకి ఇంతలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మౌనం పాటించడం వెనుక ఉన్న మర్మమేంటని కేడర్‌లో డిస్కస్ జరుగుతున్నది. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పే కేసీఆర్.. కూతురు విషయంలో మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారన్నది డాలర్ల ప్రశ్నగా మిగిలింది. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించారని.. పార్టీ లైన్ దాటారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే.. సొంత కూతురు కావడం వల్లే కవిత మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది.

లేఖ సృష్టించిన కలకలం..

గత నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభ ముగిసిన తరువాత ఈనెల 2న ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. ప్రధానంగా రజతోత్సవ సభ పాజిటివ్, నెగెటివ్ పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా.. బీజేపీపై కేసీఆర్ తక్కువ మాట్లాడడాన్ని ఆమె తప్పుపట్టారు. అలాగే.. పార్టీ పట్ల కార్యకర్తలు ఏమనుకుంటున్నారు..? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు..? అంటూ ఆ లేఖలో వివరించారు. అయితే.. ఆ లేఖ ఈనెల 22న బయటకు లీక్ అయింది. వాస్తవానికి కవిత లేఖ రాసిన రెండు రోజులకే లేఖ విషయం ప్రచారం జరిగినప్పటికీ.. 22న బయటకు రావడం సంచలనమైంది. అప్పటికి కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆమె తన కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయంలో ఆ లేఖ లీక్ అయింది. లేఖ లీక్ అయిన మరుసటి రోజే 23న ఆమె అమెరికా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే మీడియాతో మాట్లాడారు. తానే ఆ లేఖను తన తండ్రికి రాశానని వెల్లడించారు. అయితే.. గతంలోనూ చాలా లేఖలు రాశానని.. ఈ లేఖ మాత్రం ఎందుకు లీక్ అయింది అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఆ లీక్ వీరులు ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో అప్పటి నుంచి పార్టీలో కలకలం మొదలైంది.

చిట్‌చాట్‌లతో మరింత ఫైర్..

ఎమ్మెల్సీ కవిత గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ పట్ల సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ తరఫున గ్రామస్థాయిలో ఎందుకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేదని నిలదీశారు. అలాగే.. బీజేపీ నేతల హాస్పిటల్స్‌ ఓపెనింగ్‌కు బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఐటీ సెల్స్ పెట్టుకొని.. సోషల్ మీడియాలో పెయిడ్ పోస్టులతో తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు కేవలం ట్వీట్లకే పరిమితం అవుతున్నారని.. ఉద్యమాలు చేయకుండా మెస్సేజ్‌లు పెడితే ఏం లాభం ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వెళ్లి సభలు నిర్వహిస్తే ఫలితం ఏంటని అన్నారు. అయితే.. కవిత వ్యాఖ్యలు కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి అన్నవే అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తన తండ్రికి లేఖ రాస్తే వచ్చిన బాధ ఏంటని నిలదీశారు. ఆ లేఖను లీక్ చేసిన వారి పేర్లు బయటపెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలోనూ చిట్‌చాట్ నిర్వహించిన ఆమె లేఖ రాయడంలో తప్పేంటని నిలదీశారు. దాంతో రెండు రోజులుగా ఆమె వ్యాఖ్యలపైనే పార్టీలో కీలక చర్చ నడుస్తున్నది. కేసీఆర్ తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నారని టాక్ కొనసాగుతున్నది.

కవిత వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజీ

మరోవైపు.. పార్టీ అధినేత కూతురే ఈ స్థాయిలో కామెంట్స్ చేయడంతో పార్టీకి పూడ్చలేని డ్యామేజీ ఏర్పడిందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేని పార్టీ పట్ల కవిత వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌కు అస్త్రాన్ని ఇచ్చినట్లయిందని అంటున్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ.. దానిని పెద్దగా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కవిత వ్యాఖ్యలతో ఆ కామెంట్లు నిజమని ప్రజల్లో నాటుకుపోయింది. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పేరు దెబ్బతిన్నది. స్వయంగా పార్టీ అధినేత కూతురే బీజేపీలో బీఆర్ఎస్‌ను కలిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంతో ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగినట్లయిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఓ వర్గం ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాలు ఉన్నాయి. బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో కలిసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వారంతా పార్టీకి దూరం అయ్యే ప్రమాదం లేకపోలేదు. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలు సైతం రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని అంతా అనుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కవిత వ్యాఖ్యలనే ప్రధాన అస్త్రంగా ఎంచుకొని ప్రచారానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. దాంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత వెనుకబడి పోయే ప్రమాదం ఉంది.

కేసీఆర్ మౌనం ఎందుకు?

పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం చెబుతుంటారు. ఎవరు పార్టీ లైన్ దాటినా వారిపై చర్యలు తప్పవని చాలా సందర్భాల్లోనూ హెచ్చరించారు. అయితే.. తాజాగా తన కూతురు కవిత చేసిన వ్యాఖ్యలపై మాత్రం కేసీఆర్ సైలెంటుగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. పార్టీలో ఇంత సంక్షోభం నెలకొన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. కవిత పార్టీని నిలదీస్తూ లేఖ రాసినప్పటికీ అధినేత ఎందుకు మౌనంగా ఉండిపోయారనే చర్చ నడుస్తున్నది. ఇంతవరకు ఎందుకు పిలిచి మాట్లాడలేదు..? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అనే చర్చ హాట్‌హాట్‌గా నడుస్తున్నది. ఇటీవల ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ 2 గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కవిత వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించవద్దని, పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని తనయుడికి సూచించారు. కవిత లేఖ వివాదాన్ని తగ్గించడం పార్టీకి మేలని, ఈ గందరగోళం త్వరలోనే సద్దుమణుగుతుందని కేసీఆర్ చెప్పారని సమాచారం.

ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించి వివాదం కాకుండా.. లక్షల మంది కార్యకర్తలకు సంబంధించిన అంశమైనప్పటికీ కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. డ్యామేజీని కేసీఆర్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదని గులాబీ లీడర్లు మధ్య చర్చ సాగుతున్నది. కవిత వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినప్పటికీ, కేసీఆర్ మాత్రం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సమయం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? పార్టీ కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వాల్సిన అధినేత సైలెంటుగా ఎందుకు ఉన్నారు? కొందరు పార్టీ నాయకులు కవితపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నప్పటికీ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు? కవిత కామెంట్స్ చేసిన రోజే ఆమెకు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు అందుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ, పార్టీ తరఫున ఎలాంటి నోటీసులు ఆమెకు వెళ్లలేదు. ఫాంహౌజ్ నుంచి సైతం ఎలాంటి ప్రకటనా రాలేదు.

గతంలో పలువురు నేతల బహిష్కరణ

గతంలో పార్టీలోని కొందరు ముఖ్యనేతలు పార్టీ లైన్ దాటారని వారిపై కేసీఆర్ బహిష్కరణ వేటు వేశారు. ముఖ్యంగా ఉద్యమం నుంచి ఉన్న సీనియర్ లీడర్లయిన ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ.. పార్టీ నుంచి బయటకు పంపించేశారు. అయితే.. కవిత సైతం ఇంచుమించు అలాంటి కామెంట్లే చేశారు. పార్టీలో నెలకొన్న విభేదాలను బహిర్గతం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీలో వాడివేడి చర్చ నడుస్తున్నది. అయితే.. వచ్చే నెల 5న కేసీఆర్ కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణ తరువాత ఆయన కవిత అంశంపై స్పందిస్తారేమో అని పలువురు నాయకులు చెబుతున్నారు.

Next Story