Kavitha: వారిని పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా.. నల్గొండ పర్యటనలో కవిత

by Prasad Jukanti |   (  Updated:2025-11-12 07:06:19  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచిన ప్రజలకు ఒరిగేది ఏమీలేదుని కవిత విమర్శించారు.

Kavitha: వారిని పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా.. నల్గొండ పర్యటనలో కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, నక్కలగండి ప్రాజెక్ట్ ల భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఈ భూనిర్వాసితులను పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా, మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో మాట్లాడిన కవిత.. గతంలో కేసీఆర్‍ను లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నల్లగొండ అంటేనే పోరాటాల పురిటిగడ్డ అని సాయుధ రైతాంగ పోరాటంలో.. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలోనూ ఈ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతానికి నాగార్జునసాగర్ కూతవేటు దూరంలో ఉన్నా సాగు, తాగు నీరు లేదని విమర్శించారు.

కాంగ్రెస్ వచ్చి రెండేళ్లైనా అడిగే నాథుడే లేడని అందుకే సమస్యలపై ప్రశ్నించేందుకు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచిన ప్రజలకు ఒరిగేది ఏమీలేదుని ఈ ఉప ఎన్నిక ఫలితంలో 4 వేల పెన్షన్ రాదు. వారి తలరాతలు మారవని కవిత అన్నారు. పత్తి రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 20 శాతం తేమ శాతం ఉన్నా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆసుపత్రిలో రోజువారు ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి ఉందని కవిత విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలోనూ వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు మొక్కాలని కవిత అన్నారు. ఎన్ఐసీయూలో పసి పిల్లలకు సరైన సదుపాయాలు లేకుంటే ఆసుపత్రి మేనేజ్మెంట్ కమిటీ ఏం చేస్తోందని నిలదీశారు. జిల్లాసుపత్రిలో నెలకు 500 డెలివరీలు జరుగుతున్నాయని అందువల్ల ఇక్కడ "ఎపిక్యూరల్" మందు ప్రవేశపెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ కు విజ్ఞప్తి చేశారు.

వాటిపై మంత్రి కొమటిరెడ్డి దృష్టి పెట్టాలి:

మేము ఆసుపత్రికి సందర్శిస్తున్నామని తెలియగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం సందర్శనకు వస్తామని అన్నారట అని ఎద్దేవా చేశారు. మా కార్యకర్తలు పెట్టిన హోర్డింగులు, బ్యానర్లు పెడితే అరెస్టు చేశారట. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలోవెయ్యి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం320 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారని కవిత విమర్శించారు. ప్రభుత్వ దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాల్, ఆసుపత్రిలో సమస్యలు ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని డిమండ్ చేశారు. కృష్ణా జలాల లెక్కింపు ఏర్పాటు చేసిన టెలిమిట్రీ ఏర్పాటు చేయాలన్నారు. నక్కలగండి ప్రాజెక్ట్ లో ముంపుకు గురవుతున్న తండాలను జిల్లా కలెక్టర్లు విజిటింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల భూ సేకరణలో బాధిత రైతుల సమస్యను తెలుసుకోవడానికి.. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు.

భూములు కొల్పోయిన రైతులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలి:

భూదాన్ భూములపై ప్రభుత్వ కార్యాచరణ ఏంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‍లో రెండు యూనిట్లు పూర్తి అయ్యాయి. మిగతా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. థర్మల్ ప్లాంట్‍లో భూములు కొల్పోయిన రైతులకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్నారు. మిర్యాలగూడ లో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన FCI గోడౌన్, మిర్యాలగూడకు కొత్త రింగ్ రోడ్డు, కొత్త ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో అండర్ గౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేదని పలు సమస్యలున్నాయని వాటిపై పోరాటానికి జాగృతి నాయకుల కమిటీ వేస్తామని వెల్లడించారు. రోడ్ల మంత్రిగా కోమటిరెడ్డి ఉన్నారు కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి కొత్త రోడ్ల వేయాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. "అవకాశం, అధికారం, ఆత్మ గౌరవం" లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు మాదిరిగా హక్కులకోసం మేం పోరాడుతామని సమస్యల పరిష్కారం కోసం మంత్రులు కృషి చేయాలన్నారు.

Next Story