ఎవ్వరినీ వదలిపెట్టం.. లెక్కలతో సహా అందరి చిట్టా బయటపెడతాం: భట్టి

by Disha Web Desk 2 |
ఎవ్వరినీ వదలిపెట్టం.. లెక్కలతో సహా అందరి చిట్టా బయటపెడతాం: భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: గొప్పలకు పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లు కాలయాపన చేసి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు చేసి పెట్టిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక.. రెండు నెలలు అయినా గడవకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.

ఎవరినీ వదలిపెట్టబోమని.. లెక్కలతో సహా అందరి చిట్టా బయటపెడతామని అన్నారు. ఓడిపోయిన అసహనంలో కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. అంత గొప్పగా పాలిస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడాన్ని చూసే మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్పారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామ‌ని, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో బతకడానికి కావలసిన వాతావరణం కల్పిస్తామ‌న్నారు. డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమ‌న్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామ‌ని, ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి సంక్షేమమే తప్పా డ్రగ్స్ ఉండదన్న భ‌రోసా హైద‌రాబాద్ ప్రజ‌ల‌కు క‌ల్పించాల‌న్నారు. ప్రాంతాలు, మతాల పేరిట విభజన చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ఉపేక్షించమ‌న్నారు.

దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకూ తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాద‌యాత్రను విజ‌య‌వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయ‌కులు జెట్టి కుసుమ‌కుమార్‌, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు అనిల్ యాద‌వ్‌, స‌న‌త్‌న‌గ‌ర్ నియోజక‌వ‌ర్గ ఇంచార్జీ కోట నీలిమా, జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed