‘అవును అనే సమాధానం వస్తే.. మీరు విజయం సాధించినట్టే’: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

‘అవును అనే సమాధానం వస్తే.. మీరు విజయం సాధించినట్టే’: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

‘అవును అనే సమాధానం వస్తే.. మీరు విజయం సాధించినట్టే’: డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు మిమ్మల్నిఒక అధికారిగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవ‌డం వ‌ల్లనే సివిల్ స‌ర్వీసెస్ హోదాకు న్యాయం చేయ‌గ‌లిగిన వారుగా నిలిచిపోతార‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అధికారులు 10 వారాల శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ... "ప్రతిరోజు కార్యాలయాన్ని వదిలి వెళ్లే ముందు మిమ్ములని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.. మీ పని ద్వారా ఎవరి జీవితంలో అయినా ఒక మంచి మార్పు, గౌరవాన్ని తీసుకువచ్చిందా ప్రశ్నించుకోండి? అవును అని సమాధానం వస్తే.. ఆరోజు మీరు ఎంత కఠినప‌రిస్థితుల్లో విధి నిర్వ‌హ‌ణ చేసినా... మీరు విజయం సాధించినట్టే" అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నిజాయితీతో సేవ చేయండి... ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి... మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించండి... నాయకత్వంతో ముందుకు సాగండి... అని శిక్షణలో ఉన్న అధికారులకు భ‌ట్టి విక్ర‌మార్క సూచనలు చేశారు.

క‌ఠిన‌మైన శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ముగిసిపోయి... బాధ్య‌త‌, వివేకం, విచ‌క్ష‌ణ‌, ప్ర‌జా విశ్వాసంతో కూడిన కొత్త ఆరంభాన్ని అందిస్తోంద‌ని డిప్యూటీ సీఎం అన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన 203 మంది అధికారులు ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు అంద‌రికీ డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఇక్క‌డ‌కు అందరూ ఇంజినీర్లు, వైద్యులు, ఆర్థిక నిపుణులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులుగా వచ్చారు... ఇక్క‌డ‌నుంచి అత్య‌న్న‌త స్థాయి గుర్తింపు, గౌర‌వంతో బ‌య‌ట‌కు వెళుతున్నారు. ప్రతిభకు, అర్హతలకు అనేక అవకాశాలు ముందున్నాయని డిప్యూటీ సీఎం అన్నారు.

ఈ రోజు కేవలం ఆనంద‌ప‌డే కార్యక్రమం మాత్రమే కాదు. ఇక్క‌డ‌నుంచి బాధ్య‌త‌లు, బదిలీలు, క్లిష్ట‌మైన స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఫైళ్లు ఉంటాయి. స‌రైన స‌మయంలో స్పందించాల్సిన అంశాలు ఉంటాయి. విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంతో తీసుకునే ఒక నిర్ణ‌యం ఒకరి జీవితాన్ని ఏళ్ల‌పాటు ప్రభావితం చేస్తుంది. అందువ‌ల్ల నిబ‌ద్ద‌త‌తో విధి నిర్వ‌హ‌ణ చేయాల‌ని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, ఎంసీఆర్‌హెచ్ఆర్డీ వైస్ ఛైర్ ప‌ర్స‌న్ శాంత‌కుమారి పాల్గొన్నారు.

Next Story