- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండ.. చండీగఢ్‌లో డిప్యూటీ సీఎం భట్టి పరామర్శ
చండీగఢ్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ (IPS Puran Kumar) కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పరామర్శించారు. (Chandigarh) చండీగఢ్‌లో సోమవారం అధికారి పూరన్ కుమార్ నివాసంలో ఆయన సహచరి ఐఏఎస్ అధికారి అమనీత్ గిల్‌ను కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క ఓదార్చారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, పూరన్ కుమార్ కుటుంబ సభ్యులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఫోన్‌లో మాట్లాడించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి.. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో భట్టి విక్రమార్క మాట్లాడి, సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద అధికారులు ఉన్నా, వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ‘పూరన్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో చదివిన మేధావి. ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించే విషయం. ఆయన సూసైడ్ నోట్‌ను డైయింగ్ డిక్లరేషన్‌గా పరిగణించాలి. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోక పోవడం దురదృష్టకరం.’ అని వెల్లడించారు. పూరన్ కుమార్ వృద్ధ తల్లిదండ్రులు, చిన్న పిల్లలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. కుల వివక్షకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఝార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొప్పుల రాజు, చండీగఢ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హెచ్.ఎస్. లక్కీ, మీడియా అడ్వైజర్ భూపేంద్ర సింగ్ బూర, పర్దీప్ నర్వాల్, దీపక్ లుభానా, జస్ప్రీత్ సింగ్, రాజ్ దీప్ సిద్ధు, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.






