- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి బాధలు స్వయంగా చూశా.. విన్నా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి హరీశ్‌రావు సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని మాజీ మంత్రి హరీశ్‌రావు సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.14,250 కోట్ల ఆదాయం సమకూరిందని.. ఈ ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వాటాగా రావాల్సిన రూ.5,740 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేసిందన్నారు. గత ప్రభుత్వం 2020 నుంచి ఆ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ చేయకుండా కాలయాపన చేసిందని.. ఆ నిధులను మొత్తంగా స్టాంప్ డ్యూటీ ఆదాయంగానే చూపించి తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు పునరావృతం కావద్దని.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయరాదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను కేటాయించిందన్నారు.
పేద రైతులకు తీవ్ర అన్యాయం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను పార్ట్-బి జాబితాలో చేర్చి పదేళ్లపాటు వారిని హింసించిందని ధ్వజమెత్తారు. అసైన్డ్ భూముల అంశంపై హరీశ్‌రావు మాట్లాడుతున్న క్రమంలో జోక్యం చేసుకుని ఘాటుగా స్పందించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ అసైన్డ్ రైతులు తమ భూములకు హక్కులు లేక పడుతున్న గోడును స్వయంగా విన్నానని గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన వారికి సాగు కోసం, ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ధరణి నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి, పారదర్శకమైన భూభారతి వ్యవస్థను తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
నోటికేషన్లు తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు: మంత్రి సీతక్క
గత బీఆర్ఎస్ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పడం కాదని.. నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిరుద్యోగులకు వేతనాలు వచ్చి బతుకులు బాగుపడుతాయా అని మంత్రి సీతక్క నిలదీశారు. తాము ప్రత్యేక చొరవ తీసుకుని ఉద్యోగులను భర్తీ చేస్తే ప్రశంసలు చేయాల్సిన ప్రతిపక్షం తాము భర్తీ చేసినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పడు లేకపోవడంతో ఓర్వలేక రేవంత్ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పంపిణీ చేస్తుండటంతో జీర్ణించులేక విపక్షాలు అసత్యాలు సభలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎక్సైజ్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇష్టారాజ్యంగా టార్గెట్లు పెంచారని.. పన్నులు 200 శాతం పెంచారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పాలసీలనే తాము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు సైతం స్పందించారు. సీఎం మీద అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు. బడ్జెట్ మీద మాత్రమే ప్రసంగం చేయాలని సూచించారు.






