- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగా తొమ్మిది పథకాలు.. పేదలే లక్ష్యంగా స్కీంలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కొన్ని కొత్త పథకాలను ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనిద్వారా తమది ప్రజాప్రభుత్వం అని నొక్కిచెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27వార్షిక బడ్జెట్‌లో పలు కొత్త పథకాలు ప్రకటించారు. తొమ్మిది పథకాలను ప్రకటించి.. వాటిలో పేద ప్రజలకు ప్రాధాన్యం కల్పించారు. తమది ప్రజాప్రభుత్వం అని మరోసారి నిరూపించారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీంను ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేరిట అమలు చేస్తుండగా.. జూన్ 2, 2026 నుండి ప్రారంభం కానుంది. కాగా.. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.4,000 కోట్లు ప్రతిపాదించారు.
చేయూత: చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేయనున్నారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించాం.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు: ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. ఈ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందిస్తారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రతిపాదించారు.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం: 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రతి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తారు. దీనికి బడ్జెట్‌లో రూ.800 కోట్లు ప్రతిపాదించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.
నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం: ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ప్రభుత్వం అందించనుంది.
ఉద్యోగుల ప్రమాద బీమా పథకం: ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి 20 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల అదనపు కవరేజీ లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ రెండు పథకాల మొత్తానికి బడ్జెట్‌లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.
సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం: రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణ, వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత, విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.
ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్: ఏటీసీలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెలా 2 వేల రూపాయలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు.






