- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థలం కేటాయింపులో జాప్యం: అందని ద్రాక్షలా ఎయిమ్స్ సేవలు!
హైదరాబాద్‌లో ఎయిమ్స్ (AIIMS) అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. కేవలం రెండెకరాల స్థలం కేటాయింపు లేక నగరవాసులకు కార్పొరేట్ వైద్యం అందడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి మంజూరైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సేవలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, రాజధాని నగరానికి అది 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పేద ప్రజలు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ (యూహెచ్‌టీసీ) ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రతిపాదన దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనే మూలుగుతోంది. అధికారుల అలసత్వం వల్ల సుమారు 2 కోట్ల జనాభా ఉన్న నగరవాసులకు అత్యుత్తమ వైద్య సంస్థ అయిన ఎయిమ్స్ సేవలు అందకుండా పోతున్నాయి.
రూ.25 కోట్ల నిధులు
కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం.. ప్రధాన ఎయిమ్స్ క్యాంపస్ నగరానికి దూరంగా ఉన్నప్పుడు, పట్టణ ప్రజలకు స్పెషలిస్ట్ సేవలు అందించేందుకు నగరంలో ఒక అనుబంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. దీనికోసం సుమారు రెండు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఒకసారి స్థలం దొరికితే, నిర్మాణానికి అవసరమైన రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల నిధులను కేంద్రమే భరిస్తుంది. ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది జీతాలు, ఉచిత మందుల ఖర్చు కూడా కేంద్రమే చూసుకుంటుంది.
ఒడిస్సాలో సక్సెస్
ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ఎయిమ్స్ అర్బన్ సెంటర్ అద్భుతమైన సేవలు అందిస్తోంది. నగరంలోని యూనిట్-4 ప్రాంతంలో ఉన్న ఈ కేంద్రం ద్వారా ప్రతిరోజూ వందలాది మంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతోంది. ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్), ఉత్తరాఖండ్ (రిషికేశ్) వంటి రాష్ట్రాల్లోనూ ఈ కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం భూమి కేటాయింపు దగ్గరే ప్రాజెక్టు నిలిచిపోయింది. ఫలితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి.
రెండేళ్లుగా నిరీక్షణ
ఎయిమ్స్ బీబీనగర్ తరఫున ఏర్పాటు చేయబోయే అర్బన్ హెల్త్ సెంటర్ కోసం రెండెకరాల స్థలం కేటాయించాలని దాదాపు రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించాల్సిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వదిలేశారు. ఇంత కీలకమైన నిర్ణయం తీసుకునే విషయంలో కనీసం ప్రభుత్వ పెద్దలకు నచ్చజెప్పి అయినా స్థలం కేటాయించేలా చేయాల్సిన అధికారులు సైతం మౌనంగా ఉండటం గమనార్హం. ఫలితంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు వ్యవహారం అటకెక్కింది. దీనిపై అప్పట్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. పేద ప్రజలకు ఎయిమ్స్ వైద్యం అందించే అవకాశాన్ని చేజారకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో సంప్రదిస్తే ఎలాంటి స్పందన రాలేదు.
ప్రయోజనాలు..
బీబీనగర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నగరంలోనే ఎయిమ్స్ డాక్టర్ల ఓపీడీ సేవలు లభిస్తాయి. ఎక్స్-రే, ఈసీజీ, రక్త పరీక్షలు వంటివి ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. బీబీనగర్ మెయిన్ క్యాంపస్‌లో రద్దీ తగ్గి, తీవ్రమైన జబ్బులు ఉన్నవారికి అక్కడ మెరుగైన చికిత్స అందుతుంది. ఎయిమ్స్ విద్యార్థులు పట్టణ ఆరోగ్య సమస్యలపై పరిశోధన చేసేందుకు ఇది ఒక కేంద్రంగా మారుతుంది. నగరంలో ఉన్న ప్రధాన హాస్పిటల్స్ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ పై ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఓపీ సేవల కోసం వచ్చే వారికి సరైన వైద్య సేవలు అందే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా పేద రోగులకు మంచి వైద్య సేవలు అందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేజారకుండా చూస్తే మేలని వైద్య వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉంది. కేవలం రెండు ఎకరాల స్థలం కేటాయింపుతో కోట్ల రూపాయల కేంద్ర నిధులు రావడమే కాకుండా, లక్షలాది మంది పేదలకు ప్రాణవాయువులాంటి వైద్యం అందుతుంది. సర్కార్ సానుకూలంగా స్పందించి ఈ హెల్త్ సెంటర్ కల సాకారం చేస్తుందో లేదో వేచి చూడాలి.






