భయపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ఒకటి మరువక ముందే మరొకటి

by Prasad Jukanti |   (  Updated:2025-11-03 10:29:17  IST  )

బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేనంతగా రోడ్లపై ముత్యువు కాచుకు కూర్చోంటోంది.

భయపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ఒకటి మరువక ముందే మరొకటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది చనిపోయారు. నెత్తుటి రహదారి అనే ముద్ర పడిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నంబర్ 163 పైనే ఈ ఘోర విషాదం చోటు చేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నాటకలోని బీజాపూర్ వరకు 365 కి.మీ ఉండే ఈ ఎన్‍హెచ్ 163 అంటేనే రక్తం మరిగిన రహదారి అనే పేరు పడిపోయింది. ఎక్కడ చూసినా గుంతలు, ఇరుకు రోడ్లు, మూల మలుపులతో ప్రతిరోజు ఆ రోడ్డుపై ప్రమాదాలతో ఈ రహదారి మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

విస్తరణ పనులు మొదలైన రెండ్రోజులకే:

చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదానికి ఎన్ హెచ్ 163 రహదారి దుస్థితే కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధా మార్గాల్లో ఒకటైన ఈ రహదారి వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు అత్యంత కీలకంగా ఉంది. ఇలాంటి రోడ్డు విషయంలో అడుగడుగునా అలసత్వం, నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వినిపిస్తోంది. ఈ రోడ్డును విస్తరించేందుకు 2018లో కేంద్రం నిర్ణయించింది. దాంతో అప్పటి వరకు ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు హైవేగా ప్రకటించడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విస్తరణ కోసం భూసేకరణ విషయంలో పనులు ఆలస్యం అయ్యాయి. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. గత శుక్రవారమే(అక్టోబర్‌ 31) మొయినాబాద్‌-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోటరం సంభవించింది.

మృత్యుమార్గం:

ఎన్ హెచ్163 పై జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది డిసెంబర్‍లో చేవెళ్ల మండలం ఆలూరు స్టేజివద్ద కూరగాయలు అమ్ముకునేవారిపై ఓ లారీ దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు సెప్టెంబర్ లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జూన్ లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఇలా నిత్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ 163 జాతీయ రహదారి తెలుగు ప్రజల వెన్నులో వణుకుపుట్టిస్తోంది.

వరుస ప్రమాదాలు

ఇక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రయాణం అంటే వణికిపోయేలా ఇటీవల వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల 24న కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ఫైరింగ్ లో 20 మంది చనిపోయారు. నిన్న రాజస్థాన్ లో బస్సు ప్రమాదంలో 18 మంది చనిపోయారు. గత నెల 28న రాజస్తాన్ లో బస్సులో కాలిపోయిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. తాజాగా బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటడం వాటిల్లో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుండటం దేశంలో ఆందోళన కలిగిస్తోంది.

READ MORE ...

రెప్పపాటులో ఘోరం జరిగింది.. బస్ కండక్టర్ రోదన

Next Story