రూ.5,310 కోట్లు BRS ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్లే ప్రమాదం: Guduru Narayana Reddy

by Disha Web Desk 19 |
రూ.5,310 కోట్లు BRS ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్లే ప్రమాదం: Guduru Narayana Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవినీతిపై ‘అవినీతి బంధు’గా మారకుండా స్వయంగా విచారణ చేపట్టాలని బీజేపీ సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డి హైకోర్టును కోరారు. లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరిగిందని సీఎం స్వయంగా అంగీకరించారని ఇది దురదృష్టకరమన్నారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్ల జాబితా తన వద్ద ఉందని చెప్పారని, సీఎం వ్యాఖ్యలు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందన్నారు. హైకోర్టు తక్షణమే రంగంలోకి దిగి స్వీయ విచారణ చేపట్టాలని, లంచం తీసుకున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించాలని, ఈ అంశంపై రాజ్యాంగ బద్ధ సంస్థతో విచారణకు ఆదేశించాలని హైకోర్టు సీఎంను కోరాలని అన్నారు.

ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.17,700 కోట్లు కేటాయించారని రాష్ట్రంలోని 1.77 లక్షల మంది దళితులకు ఈ పథకం లబ్ది కోసం ప్రతిపాదించారని, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఎమ్మెల్యేలు వారి అనుచరులు పథకం నుంచి ప్రయోజనం పొందడానికి వారి పేరును క్లియర్ చేయడానికి అర్హులైన వ్యక్తుల నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు రూ.5,310 కోట్లు చేతులు మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 1,475 మంది దళితులను ఎంపిక చేయాలని ప్రతిపాదించారని అంటే ఒక్కో ఎమ్మెల్యే దాదాపు 44 కోట్లు దోచుకోవడానికి ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు సిపారసు చేసే అధికారం ఇవ్వడం ద్వారా కేసీఆర్ పథకంలో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని ఆరోపించారు.


Next Story

Most Viewed