ఇల్లు కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్..రెండు రోజులపాటు నగ‌రంలో క్రెడాయ్ ప్రాపర్టీ షో

by Ajay Maddhiboyina |

భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అత్యున్నత సంస్థ క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది.

ఇల్లు కొనాల‌నుకునేవారికి గుడ్ న్యూస్..రెండు రోజులపాటు నగ‌రంలో క్రెడాయ్ ప్రాపర్టీ షో
X

దిశ‌, వెబ్ డెస్క్: భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అత్యున్నత సంస్థ క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. “హైదరాబాద్ ప్రాపర్టీ షో – 2025”ను ఆగస్టు 15 నుండి 17 వరకు, హైటెక్స్‌లోని హాల్ నంబర్ 1 మరియు 3లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది థీమ్ “ఎంచుకోవాల్సింది మీరే” కాగా ఇది కస్టమర్స్ స్వేచ్ఛగా, పారదర్శకంగా, నమ్మకంగా అవసరాలకు తగినట్టుగా ఇంటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే భావనతో ఉండటం చూపిస్తుంది. హైదరాబాద్ ప్రాపర్టీ షో – 2025 నిర్వహిస్తున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ అధ్యక్షుడు బి. జగన్నాథ్ రావు, ప్రధాన కార్యదర్శి కె. కాంతి కిరణ్ రెడ్డి, కుర్ర శ్రీనాథ్ (కన్వీనర్), అరవింద్ రావు మెచినేని (సహ కన్వీనర్) పాల్గొన్నారు. ఇతర కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ పై ఉన్న అపోహలకు స్వస్తి చెప్పే సమయం వచ్చిందని క్రెడాయ్ హైదరాబాద్ స్పష్టం చేసింది. నిజాలు చెప్పే ప్రయత్నమే ఈ ప్రదర్శన లక్ష్యమని పేర్కొంది. అపోహలు తొలగించేందుకు, స్పష్టతను కలిగించేందుకు, నిజమైన అవకాశాలను అందించేందుకు ఈ వేదిక సిద్ధమైంది. గృహ ప్రదర్శనలో కేవలం రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులకే చోటు కల్పించనుంది. అన్నీ క్రెడాయ్ సభ్య డెవలపర్ల ప్రాజెక్టులే కావడం విశేషం. నగరమంతా విస్తరించిన అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య ప్రాంగణాలు – ఇవన్నీ ఒకే వేదికపై ప్రదర్శించనున్నారు. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుంది.

క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జైదీప్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బలమైన స్థిరత్వాన్ని, బలమైన నమ్మకాన్ని కలిగిస్తుందని అన్నారు. నిరంతరం డిమాండ్, కొనుగోలు దారుల నమ్మకం ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాన కారకాలు అని చెప్పారు. 2025 మేలో నగరంలో ₹4,300 కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడం ద్వారా 14 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ స్థిరమైన వృద్ధికి ఉద్యోగావకాశ కేంద్రాల విస్తరణ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు కారణమని పేర్కొన్నారు. 2030 నాటికి నగరంలో 200 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్లోబల్ సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి కనిపిస్తోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మెట్రో రైలు విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులు ప్రకటించడం నగరానికి పెద్ద మలుపు తిప్పుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటి నిర్మాణం మొదలైతే, నగర మౌలిక వసతులలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నుంచి పెట్టుబడులు స్థిరంగా రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు, గృహ అవసరాలు రెండూ పెరుగుతున్నాయని వివరించారు. అనేక కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయని, వాటిలో చాలా వరకు 50 అంతస్థుల బహుళ అంతస్తుల భవనాలు ఉండటం మార్కెట్ పై నమ్మకాన్ని పెంచేలా చేస్తున్నాయన్నారు .రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన రెపో రేటు తగ్గింపు వల్ల గృహ రుణాలు చౌకగా అందుబాటులోకి రావడం కొనుగోలుదారులకు ఊతమిస్తుందని తెలిపారు. ఈ దశలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమన్నారు. భవిష్యత్ కు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని సూచించారు.

క్రెడాయ్‌కి నూతనంగా ఎన్నికైన హైదరాబాద్ అధ్యక్షుడు బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నిజమైన గ్లోబల్ నగరంగా స్థిరపడింది. వ్యాపార మాంద్యాల సమయంలోనూ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా ఉంది. ఉన్నత స్థాయి మౌలిక వసతులు, చల్లని వాతావరణం, ప్రతిభావంతులైన మనుషులు ఉన్నారన్నారు. వ్యాపారాలకు అనుకూల విధానాలు, భద్రమైన జీవన వాతావరణం లాంటి అనేక అంశాల నేపథ్యంలో నగరానికి వివిధ రంగాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఐటీ, తయారీ, ఔషధ, జీవ శాస్త్రాలు, విద్యుత్ వాహనాలు, రక్షణ రంగాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదురవుతున్న గట్టు పరిస్థితుల మధ్యలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు హైదరాబాద్ మొదటి ఎంపికగా నిలుస్తోందని, నగర అభివృద్ధిపై నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అనేది మంచిదని, కాలానుగుణమైన నిర్ణయమని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ కన్వీనర్ కుర్ర శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రాపర్టీ షో కేవలం రియల్ ఎస్టేట్ ప్రదర్శన మాత్రమే కాదు, ఇది సరైన ఎంపిక, నమ్మకం, ప్రజలతో సంబంధానికి సంకేతమన్నారు. 70కి పైగా ప్రతిష్ఠాత్మక క్రెడాయ్ డెవలపర్లు ఒకే వేదికపై భాగస్వాములవుతుండటంతో, ఇల్లు మాత్రమే కాదు – విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. సాధారణ అపార్ట్మెంట్ల నుంచి లగ్జరీ విల్లాలు, నిర్మాణంలో ఉన్నవి రెడీ టూ మూవ్ ఇన్ ప్రాజెక్టుల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయని తుది నిర్ణయం కస్టమర్లదే అన్నారు. కుటుంబాల కోసం ప్రత్యక్ష కళాప్రదర్శనలు, ఉత్సాహభరితమైన సంగీత ప్రదర్శనలు, నిపుణుల సెషన్లు, ఫుడ్ స్టాల్స్ ఇలా అన్ని కోణాల్లోను ఇది ఒక మంచి అవకాశం అని చెప్పారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరం మాత్రమే కాదని, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీతో సమపాళ్లలో అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ అని చెప్పారు. నగరంలోని టాప్ ప్రాజెక్టులన్నీ ఒకే చోట ఉన్నప్పుడు, ప్రతీ వీకెండ్ సైట్‌ల కోసం తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవడం ఎందుకని అన్నారు. ఆగస్టు 15 నుండి 17 వరకు హైటెక్స్ కేంద్రంలోని హాల్ 1 & 3లో జరుగనున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించాలని సూచించారు.

Next Story