జీవో 252ను సవరించి జర్నలిస్టులను ఆదుకోవాలి.. సీపీఎం డిమాండ్

by Ramesh Naini |

జీవో 252ను సవరించి జర్నలిస్టులను ఆదుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

జీవో 252ను సవరించి జర్నలిస్టులను ఆదుకోవాలి.. సీపీఎం డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీవో 252ను సవరించి జర్నలిస్టులను ఆదుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 252 జీవో ద్వారా జర్నలిస్టులను వర్గీకరించాలని భావించిందని పేర్కొన్నారు. రిపోర్టర్లకు అక్రెడిటేషన్, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. దీంతో సాధారణ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులతోపాటు చిన్న, మధ్యతరహా పత్రికలు అక్రెడిటేషన్లను కోల్పోతుండటంతో వందలాది మంది వర్కింగ్ జర్నలిస్టులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ జీవోను సవరించి, అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న మధ్యతరహా పత్రికలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులకు కనీస భద్రత లేదు..

రాష్ట్రంలో జర్నలిస్టులకు కనీస భద్రత, సంక్షేమం లేదని ఆరోపించారు. ఆరోగ్య బీమా అమలు కావడంలేదని, హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందడం లేదన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు పరిహారం ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో, విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో తీవ్ర జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించింది.. తక్షణమే జర్నలిస్ట్ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Next Story