- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 వేల గ్రామకంఠం భూముల ప్రైవేటీకరణ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపణలు
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12వేల గ్రామ పంచాయితీలకు చెందిన గ్రామకంఠం భూములను 30 ఏళ్ళ పాటు ఐవోఆర్‌ఏ ఎకోలాజికల్ సొల్యూషన్ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12వేల గ్రామ పంచాయితీలకు చెందిన గ్రామకంఠం భూములను 30 ఏళ్ళ పాటు ఐవోఆర్‌ఏ ఎకోలాజికల్ సొల్యూషన్ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలక మండళ్ళు లేని సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలను తీసుకోవాలనుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. వేలాది కోట్ల ఆస్తులను ఒకే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్లు సందేహాలు వస్తున్నాయని, ఈ ఒప్పందం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగంలోని 73వ సవరణ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమని, తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలమని, హరిత సౌభాగ్యం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలోని గ్రామ కంఠం భూములను ఢిల్లీకి చెందిన ఒక ప్రయివేటు కంపెనీకి కట్టబెడితే గ్రామపంచాయితీలు తమ హక్కులు కోల్పోతాయని, గ్రామాలకు రావాల్సిన ఆదాయం కోల్పోతుందని వివరించారు. దీని వల్ల భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానవాటికలు, పేదల పునరావాసం, తదితర ప్రజా అవసరాలకు భూములు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల విలువ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుని, గ్రామపంచాయితీలకే పూర్తి హక్కులను ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.






