John Wesley : సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

John Wesley : సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో రూ.5 వేల కోట్లు , ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకంగా రూ. 1000 కోట్లు కేటాయించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించినప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు, రీసెర్చ్ స్కాలర్స్, యూనివర్సిటీలో సమస్యలను వివరించారన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, అసొసియేట్ ఫ్రొఫెసర్లతో పాటు బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను సుదీర్ఘ కాలం కొనసాగిస్తున్నారన్నారు.

నిధుల కొరతతో ల్యాబ్ పరికరాలు, హస్టల్స్, మెస్, స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హస్టల్స్ లో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్ అక్రిడిటేషన్ గుర్తింపులో వెనుకబడి ఉందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. . విశ్వవిద్యాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, వీటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినులపై వేధింపులు నిరోధించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క స్కిల్ యూనివర్సిటీ కాకుండా ప్రతి యూనివర్సిటీని స్కిల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. లేఖలో సీఎంను కోరారు.

Next Story