బహిరంగ సభలో విభజన హామీలు అమలు ప్రకటన చేయాలి.. మోడీకి సీపీఎం లేఖ

by Ajay Maddhiboyina |

తెలంగాణ విభజన హామీల అమలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన బహిరంగ లేఖ రాశారు.

బహిరంగ సభలో విభజన హామీలు అమలు ప్రకటన చేయాలి.. మోడీకి సీపీఎం లేఖ
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ విభజన హామీల అమలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ ప్రజల ఆవేదనను మీ దృష్టికి తీసుకువస్తున్నాం. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు కావస్తున్నా విభజన హామీల పట్ల మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోంది. అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజికన్యాయం వంటి అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ సభలో రాజకీయ విమర్శలు, మత విద్వేషాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమస్యలపై ప్రస్తావించాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీని పక్కనపెట్టారు. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాల్సింది పోయి, ఆస్తులను వేలం వేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టుకు నిధులు నిరాకరించడం, ఐటీఐఆర్‌రద్దు చేయడం వల్ల తెలంగాణ యువత లక్షలాది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.

‘విద్యుత్ సవరణ బిల్లు’తో ఉచిత విద్యుత్తుకు ఎసరు పెడుతున్నారు. కార్మిక హక్కులను కాలరాసే ‘లేబర్ కోడ్స’ను తెచ్చి కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా, కేంద్రం కులగణన చేపట్టకపోవడం బీసీల పట్ల మీ వ్యతిరేకతకు నిదర్శనం. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి. ‘విబిజిరామ్ జి’ పేరుతో కొత్త చట్టం తెచ్చి కేంద్రం తన వాటాను 90శాతం నుండి 60శాతానికి తగ్గించి, 60 లక్షల మంది కూలీల బతుకుదెరువును దెబ్బతీస్తున్నారు. ఎస్ఐఆర్ పేరుతో వలస కూలీలు, పేదలు, మైనారిటీల ఓట్లు గల్లంతు చేయడం రాజ్యాంగ విరుద్ధం. సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు ఆపాలి. విద్యా, సాగునీటి రంగం: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారు. విభజన చట్టం ప్రకారం హార్టికల్చర్ వర్సిటీకి నిధులు ఇవ్వలేదు.

గిరిజన వర్సిటీకి పూర్తి నిధులు ఇవ్వకపోగా, కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. చట్ట ప్రకారం రావాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలు, జీఎస్టీ ప్రోత్సాహకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అభివృద్ధిపై చర్చను పక్కనపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొడుతూ తెలంగాణలో రాజకీయ లాభం పొందాలని చూడటం గర్హనీయం. ప్రధాన మంత్రి గారూ, మీరు ఇప్పుడు నిర్వహిస్తున్న హైదరాబాద్ సభ ప్రజల సమస్యలకు సమాధానం చెప్పే సభగా ఉండాలి కానీ, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రజలు సహించరు. రాష్ట్రంలోని లౌకిక శక్తులన్ని దాన్ని ప్రతిఘటించేందుకు ముందుకొస్తారు’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖలో పేర్కొన్నారు.

Next Story