రాజకీయాల్లోకి గవర్నర్లు దూరడం సరికాదు: సీపీఎం పోలిట్​బ్యూరో సభ్యులు ఏ. విజయ రాఘవన్​

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-12 16:55:31  IST  )

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఏ విజయ రాఘవన్ అన్నారు.

రాజకీయాల్లోకి గవర్నర్లు దూరడం సరికాదు: సీపీఎం పోలిట్​బ్యూరో సభ్యులు ఏ. విజయ రాఘవన్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఏ విజయ రాఘవన్ అన్నారు. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండడంతో రాజ్ భవన్ లు ప్రత్యామ్నాయ సచివాలయాలుగా మారుతున్నాయని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తో కలిసి విజయ రాఘవన్​మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో 12 విశ్వవిద్యాలయాలు ఉంటే 11 వర్సిటీలకు గవర్నర్లు వీసీలను నియమించడం లేదన్నారు. వర్సిటీలకు ఛాన్సలర్ గా ఉంటున్న గవర్లర్లు అప్రజాస్వామీకంగా వ్యవహరిస్తున్నారని, అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్మించారు. బీహార్ లో ఓట్లను తొలగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదన్నారు.

దేశాన్ని విచ్చిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆధార్, రేషన్ కార్డులను పరిగణలోకే తీసుకోవడం లేదన్నారు. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్వతంత్రంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర కమిటీ చర్చించి కార్యాచరణ ను రూపొందించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ లని అమలు చేయాలని చూస్తున్న కేంద్రం కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని ఏ విజయ రాఘవన్ విమర్శించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న దేశ వ్యాప్త సమ్మెకు కార్మికులు, రైతులు, కూలీల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బ్రిక్స్ సమావేశం తర్వాత భారత్ పై అమెరికా సుంకాలను మరింత పెంచిందని, ఇది ఎంఎస్ ఎంఈ పై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వ్యవసాయ వస్తువులపైన కేంద్రం ఇంకా సుంకాలు విధిస్తున్నదని ఇది రైతులపై భారం పడుతున్నదన్నారు.

ట్రంప్​విధానాలపై కేంద్రం స్పందించాలి:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ విధిస్తున్న టారిఫ్ లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ ​చేశారు. భారత ప్రజలు, పారిశ్రమిక వేత్తలు నష్టపోకుండా ఉండేలా వారికి భరోసా కల్పించేలా కేంద్రం ప్రకటన చేయాలన్నారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ లను వ్యతిరేకంచాలని, అమెరికా టారిఫ్ పై చైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించిందని అదే తరహా లో మోడీ ప్రభుత్వం స్పందించాలని ఏ విజయ రాఘవన్ డిమాండ్​చేశారు. అమెరికాకు అనుకూలంగా టారిఫ్ లని ట్రంప్ పెంచడంపై భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దేశంలో మానవ హక్కులపై దాడి జరుగుతున్నదని, ముస్లిం, మైనారిటీ లపై బీజేపీ దాడి చేస్తున్నదన్నారు. ఇందుకు కారణం కేంద్ర మంత్రులు కొందరు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతుండడమేనన్నారు. అస్సాం, బెంగాల్ లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, భారత పౌరసత్వం నిరూపించుకోవాలని చెప్తున్నారని గుర్తు చేశారు. మావోయిస్టుల రాజకీయ విధానానికి తాము మద్ధతు ఇవ్వడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ మావోయిస్టులను అంతమోందిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని విజయ రాఘవన్ వ్యాఖ్యానించారు.

కార్మికుల పని గంటలు పెంచడం అన్యాయం: బీవీ రాఘవులు

తెలంగాణలో 8 గంటల పని దినాలను 10 గంటలకు పెంచుతూ రేవంత్ సర్కార్ 282 జీవో తీసుకు రావడం దురదృష్టకరం అని బీవీ రాఘవులు అన్నారు. పని గంటలను పెంచే విధంగా బీజేపీ సర్కార్​ప్రయత్నం చేస్తోందని, ఇందుకు ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో సోయా పంట కీలకంగా ఉందని, అమెరికా సుంకాలకు మోదీ ప్రభుత్వం లొంగిపోతే పంటలు, పాల ఉత్పత్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్ల వ్యాపారం, ఫార్మా ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని, అమెరికా సుంకాలకు మోడీ ప్రభుత్వం లొంగిపోయే ఆలోచనలో ఉన్నారని బీవీ రాఘవులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపైన రేవంత్ రెడ్డి ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్న రేవంత్ రెడ్డి ఈ అంశాలను లేవనెత్తాలని డిమాండ్​చేశారు. అమెరికాను పొగడటమే కాదు దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి గ్రహించగలగాలని అన్నారు.

కల్తీ కల్లు ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి: సీపీఐ (ఎం )రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రాష్ట్రంలో కల్తీ కల్లు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పందించాలని సీపీఐ (ఎం )రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు. డ్రగ్స్​ను అరికడతానన్న సీఎం రేవంత్​కల్తీకల్లు మృతుల గురించి స్పందించరా? అని ప్రశ్నించరా అని ప్రశ్నించారు. బసవతారకం నగర్ లో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గం అన్నారు. 40 ఏండ్ల నుంచి ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నారన్నారు. అధికారంలోకి రాకముందు బసవతారక్ నగర్ లో ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఇండ్లు కూల్చడం ఏంటి..? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలని తమ పార్టీగా డిమాండ్​చేస్తున్నానన్నారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే భవిషత్ పోరాటాలకు సిద్ధం అవుతాం అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అయినా అమలు చేయాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సీపీఐ (ఎం) పార్టీ ఉంటుందని జాన్​వెస్లీ వెల్లడించారు. బలం ఉన్న దగ్గర ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.

Next Story