స్థానిక పోరులో పొత్తుకు సీపీఐ సై..! జూబ్లీహిల్స్​లో సైతం మద్దతు.. పీసీసీ చీఫ్​‌తో సీపీఐ అగ్రనేతల భేటీ

by Ramesh Naini |

గత అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్ ​పొత్తు పెట్టుకున్న సీపీఐ పార్టీ రానున్న లోకల్​బాడీ ఎన్నికల్లోనూ పొత్తుకు సిద్దమైంది.

స్థానిక పోరులో పొత్తుకు సీపీఐ సై..! జూబ్లీహిల్స్​లో సైతం మద్దతు.. పీసీసీ చీఫ్​‌తో సీపీఐ అగ్రనేతల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో (Congress) కాంగ్రెస్ ​పొత్తు పెట్టుకున్న (CPI) సీపీఐ పార్టీ రానున్న (Local body election) లోకల్​బాడీ ఎన్నికల్లోనూ పొత్తుకు సిద్దమైంది. ఇటు త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతుగా ఎన్నికల్లో పాల్గొననున్నట్లుగా ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర అగ్రనాయకత్వం (TPCC Chief Mahesh Kumar Goud) టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​‌తో మంగళవారం హైదరాబాద్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్నికల్లో తమకు బలమున్న సీట్లు, తమకు కేటాయిస్తే గెలిచే స్థానాలు, జడ్పీలు, జడ్సీటీసీలు, ఎంపీటీసీల గురించి అనేక ప్రతిపాదనలు సీపీఐ కాంగ్రెస్​ ముందుంచి నట్లు తెలిసింది.

ఈ చర్చల్లో కొత్తగూడెం, ఖమ్మం జడ్పీ సీట్లు వీలైతే నల్లగొండ జడ్పీ సీట్లను ఇచ్చే అవకాశాలు పరిశీలించాలని కోరినట్లుగా సమాచారం. ఇక జడ్పీటీసీలు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మహాబూబ్​ నగర్, మహాబూబాబాద్​ జిల్లాల్లో తమకు పట్టున్న సీట్లు కావాలని కోరినట్లుగా తెలిసింది. అయితే స్థానిక ఎన్నికలపై బుధవారమే హైకోర్టులో కీలక విచారణ ఉండటంతో కోర్టు ఆదేశాలతో ముందుకు పోవాల్సి ఉన్నందున సీట్ల పంపకాలపై కాకుండా కలిసి పనిచేద్దామనే కోణంలో ప్రాథమిక స్థాయి చర్చలు చేపడదామని మహేశ్​ కుమార్​ గౌడ్​ చెప్పినట్లుగా తెలిసింది. కోర్టు తీర్పు అనుసారం వీలైనంత త్వరలో మళ్లీ చర్చలు జరుపుదామని నేతలు నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సీపీఐ నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహా, కలవెని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story